చదరంగం
తేది : 20-07-2022
శీర్షిక : భ్రమల తీరం
కవిత సంఖ్య : 144+9
చీకటి వెలుగుల సమ కాలంలో
కష్ట సుఖాల పావులను కదుపుతూ
సుఖదుఃఖాలను ప్రతిఫలాలను
అనుభవిస్తూ .... ఈదే భవసాగరమే ....
అంతా తెలుసుననుకునే మనిషికి
అసలు తెలియని జననం...
తోవ తెలియని గమనం...
గమ్యమెరుగని పయనం ....
తెలుసుననుకునే భ్రమల ముగింపుకై ...
బతుకు పయనమనే నిజం తెలియని
బహుదూరపు బాటసారి...
చదునైన మైదానము కాదు
చలాకీగా సాగే వాహనం కాదు
కలల లోకంలో తేలియాడే
సప్త వర్ణాల సుందరం కాదు ....
ఎత్తుపల్లాల ఎగుడుదిగుడులు
ఒత్తుగా పెరిగిన చిత్తడి నేలలు
ఆలోచించుకున్నంత అందం కాదు
ఎదురై వచ్చే యక్ష కన్య కాదు ....
అనుక్షణం ఆరామమెరుగని
ఉరుకుల పరుగులతో
కనపడని వాస్తవాలను
కబంధ పరుచుకోవడమే ....
కనులముందు కదలాడి మాయమయ్యే
కార్య సాధనలను చేరుకుంటూ
తెలుసనుకుంటూ బయలుదేరి
తెలియని భ్రమల తీరం చేరడమే
బ్రతుకు చదరంగం .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment