సంస్కారమే నా తీరం
తేది : 15-07-2022
శీర్షిక : సంస్కార హిమశిఖరం
కవిత సంఖ్య : 937
గ్రెగోరియన్ కాల గమనంలో
పేజీల మార్పులా కాకుండా....
ఆయనంలో మార్పులను ఆహ్వానిస్తూ
ఋతువులో శోభించే ప్రకృతికి పబ్బతి పడతా ....
గ్రీన్ విచ్ రేఖ చివరన గిర్రున తిరిగే
భూగ్రహపు మలుపులా కాకుండా....
తరువులు చిగురించి పశుపక్ష్యాదులు పరవశించి
బ్రతుకులో వెలుగులు నింపే వసంతానికి
ఆహ్వానం పలుకుతా ....
రుధిరం స్థన్యంగా ప్రసాదించిన అమ్మకు...
స్వేదంగా చిందించి నడకలు నేర్పిన నాన్నకు...
అడుగడుగున కురిపించిన ఒడువని సేవలకు
రోజులలో రోజాలిచ్చే అభినందనలు కాకుండా ....
నిత్యం రాజులా పూజించే రమ్యమైన పద్ధతిని
స్వాగతిస్తా ....
కొదువైన వస్త్రాల కొత్త శోకులకన్న
కట్టుబొట్టుతో కనికట్టుచేసే నిండైన
వస్త్రధారణలే మిన్నైన నా సంస్కార
భారతియన్న నాకు ప్రాణసమము….
మిడిమిడి జ్ఞానాల మిధ్య చదువుల కన్నా
విజ్ఞానాల సంద్రపు వేదపురాణాలే మిన్నని
నిన్న మొన్న కనుగొన్నవెన్నో నిక్షిప్తమే వేదాలలో..
ఋషుల పేరన రూఢీ పరిచిన దాఖలాలే ....
పరులది వలదని..నాదన్నది వదలనంటు…
అతివాదం చేటని… మితవాదం ముద్దనే…
అకారణ యుద్దాలు ఆక్రమించె బుద్దులు
వద్దనే… గొప్ప సంస్కార హిమశిఖరం నా భారతం….
నగునూరి రాజన్న
No comments:
Post a Comment