Tuesday, November 8, 2022

మళ్ళీ బడికి తేది: 13-06-2022 శీర్షిక : పుటం పెట్టిన స్వర్ణం ...

 మళ్ళీ బడికి

తేది: 13-06-2022
శీర్షిక : పుటం పెట్టిన స్వర్ణం ... 
కవిత సంఖ్య : 920

అమ్మమ్మ ఇంట ఆడుకున్న 
అలుపులింకా తీరకముందే 
బడి గంట గణ గణ మోగింది
మళ్ళీ బడికి బాట చూపిస్తూ ... 

బద్దకంగా ఒళ్ళువిరుచుకుంటున్న 
బాగు బూట్లు ఏకరూప దుస్తుల 
గుండె ఒక్కసారిగా ఝల్లుమంది 
గానుగలా మళ్ళీ తిరగాలనుకుంటూ ....  

బలవంతంగా అడుగులు కూడా  
తడపడుతున్నాయి ...సంతలో 
సాంతం కొత్త తరగతి సరంజామా 
సంపూర్తిగా అందుబాటు కాలేదని ..... 

కొత్త కొత్త మిత్రులతో ఆటాపాటలాడి
గెంతాలని..మైదానాలు కోటి ఆశల 
కోరికల గుర్రాలెక్కి చల్ చల్ మంటూ 
చలాకీగా ఎదురు చూస్తున్నాయి ..... 

పూర్వీకుల దూరదృష్టి ఎంతగొప్పదో ... 
నిన్న మొన్నటి వరకు నిప్పుల 
కొలిమిలా అల్లాడిన వాతావరణం 
గీటురాయిలా ఆపేసి ... చల్లబరిచి 
సాంత్వన చేకూర్చింది తొలకరితో ... 
పిల్లలకు... తల్లిదండ్రులకు ..... 

రెండేండ్ల నుండి కరోనాతో 
కాపురం చేసిన సమాజమంతా ... 
కరువు దీరా తపిస్తూ  జపిస్తూ 
నిత్య  వసంతాలకై నిలువెల్లా 
వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నది .... 

ఇకనైనా పుస్తకాలన్నీ తిరగేసి 
మస్తకాలకు పదును పెట్టి 
పిల్లలంతా పుటం పెట్టిన 
స్వర్ణకాంతులీనాలని ఆశిద్దాం ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment