జీవకారుణ్యం
తేది : 06-07-2022
శీర్షిక : మరిచిన సహవాసం
కవిత సంఖ్య : 144+3
రాతిగుహల జీవిత కాలాన
జీవరాశిలో తానొకడై కలిసి
మెలిసి జీవించిన సహవాసపు
జ్ఞాపకాలను చెరిపేసుకుని... కరుణ
విడిచి కార్చిచ్చులు రగిలిస్తు న్నాడు ...
విధి కల్పించిన విజ్ఞానాలను
మూటకట్టుకుని ... నాగరికత వైపు
నడకలు సాగించి ...ప్రకృతి
ధర్మాలను పరిత్యజించి ... సాయం మరిచిన
వ్యవసాయం చేస్తూ రసాయనాలను
రంగరిస్తూ కలుషితాలను వెంటేసుకుని ...
వందల రకాల జీవాలను బలి చేస్తున్నాడు ....
స్వార్ధపు సంచులు నింపుకుని
తనకే కాకుండా తరాలకంటూ
కూడబెడుతూ ...తృప్తి లేని
మూషికమై దోపుకుంటున్నాడు ....
ప్రాణవాయువులకు మూలమైన
జీవధారల సెలయేళ్ళకు కారణమైన
పచ్చని మరకత శోభల తరువులను...
విచ్చలవిడిగా వినియోగిస్తూ... మరుభూమిగా
మార్చుతూ ... జీవరాశి మనుగడలను
ప్రశ్నార్థకం చేస్తున్నాడు ....
చెట్టు గుట్ట వాగు వంక డొంక ....
ఒకటేమిటి ... మట్టిని కూడా వదలకుండా
మాటేసి మనిషి కాటేస్తుంటే ...
జీవరాశి కాదు ... ముందు ముందు
సాటి మనిషి బ్రతుకు కూడా సందేహాల
వలలో చిక్కుకుంటున్నది ....
ఇకనైనా .. మనిషి ... మనిషిగా
మారకుంటే .... మారణహోమమే...
జీవరాశి ఒకటొకటిగా అంతరిస్తుంటే...
మనకెందుకులే అని పట్టనట్టు
చూస్తుంటే... అసలు మనిషి మనుగడే
అంతరించే సమయం ఆసన్నమౌతుంది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment