నీటిపై రాసిన రాతలా
తేది : 12-07-22
శీర్షిక : వేలు విడిచిన విద్వాంసులు.
కవిత సంఖ్య : 934
పంచెను ఎగదోపి నెత్తికి రుమాలు చుట్టుకుని
చేసే పనుల్లో చేయి కలుపుతూ .... మాటలో
మాట కలుపుతూ… దూరమైనా దగ్గరి వరసలు
కలిపి అన్నింటికీ నేనున్నానంటూ...అక్కరకు
రాకుండా అల్లుకుపోయే కలువలేని
కలుపుగోలుతనం ......
సముద్రాన్ని కాళ్ళవద్దకు రప్పిస్తానని
ఓడరేవు మీ ఇంటివెనక పెట్టిస్తానంటూ ...
కడుపులో తలపెట్టి కాల్మొక్కినంత
పనిచేసి....నక్క వినయాలు చూపగలగడం ....
బొక్క బోర్లా పడేయగలగడం ....
చిన్న చిన్న తగాదాలను... చిలికి
చిలికి గాలివానగా పేర్చి మార్చి ... పిలవని
పేరంటంలా మధ్యవర్తిత్వం అంది
పుచ్చుకుని ... చితి మంటలు పేర్చుతూ ...
చల్లారకుండా ఆజ్యం పోస్తూ .... త్రేతా
యుగపు నాటి లంకా దహనాలను జ్ఞప్తికి
తీసుకు రాగలిగే నేర్పరితనం ....
సరస్వతీమాతకు సహోదరులమంటూ
ధవళవస్త్రాలను దత్తం తీసుకుని ...
ఎన్నికల పత్రంలో ఏకరువు పెట్టి
ఓడెక్కినాక బోడ మల్లప్పలా మసులుకునే
నయవంచక నజరానాల నాయకత్వ
లక్షణాలను పుణికిపుచ్చుకోవడం ...
అయిపోయిన కాలమునాటి
అక్కరకు రాని హామీలిచ్చి ...
అంతస్తులు పెరగకుండా ...
అడ్డుకునే అదృశ్య శక్తులుగా నిలిచి .....
మత్తులు వదలకుండా చేస్తూ ....
చిత్తుచిత్తు చేయగలిగే తుంటరితనం ....
అరిగిపోయిన రికార్డులా ...చెప్పిందే
చెప్పుచూ ...అవి మాత్రమే అమలుపరుస్తూ
అభివృద్ధిని అరుంధతీ నక్షత్రములో
చూపించగలిగే అపర నైపుణ్యాలు వెన్నతో
పెట్టిన వేలు విడిచిన విద్వాంసులలాగా....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment