Tuesday, July 12, 2022

రైలు పట్టాలు తేది: 22-02-2022 శీర్షిక : సంధించిన బాణములు

 రైలు పట్టాలు

తేది: 22-02-2022
శీర్షిక : సంధించిన బాణములు 
కవిత సంఖ్య : 224

రాజసం ఉట్టిపడే రైలు పట్టాలు 
దృడంగా .... బలంగా ... 
ఆరోగ్యంగా ఉంటేనే .... అలవోకగా 
రైళ్లన్నీ రాచమార్గమై పయనిస్తాయి .... 

కాలమాన పరిస్థితులకు తట్టుకుని 
కష్ట నష్టాలను భరిస్తూ ... బరువు 
బాధ్యతలను మోస్తుంది ....చిన్న 
లోపమున్నా ... పెద్ద ప్రమాదమే.. 
ప్రజానష్టమో ... ఆస్తి నష్టమో ..... 

దూరాన కలిసినట్టు గోచరించినా ... 
సమాంతర రేఖలై ...  సంధించిన 
బాణములై... సాగుతుంటాయి .... 
సుదూర దూర తీరాలను కలిపే వారధులై ..... 

సంసార నావకు సరంగులైన 
భార్యా భర్తలలా ....ఆత్మీయతా 
అనురాగాల పట్టాలపై సాగిపోయే 
భవ బంధాల కుటుంబాలే  బోగిలలా  ..... 

అసలైన ప్రజాస్వామ్యానికి 
ఆస్తులు..  అధికార పక్షం  
ప్రతిపక్షాలు ...ఇరుసు ఇంధనమై 
రైలు పట్టాలలా కదిలితేనే ....
కలకాలం క్షేమం ప్రజాస్వామ్యం ...... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment