అమ్మ ఒడి
తేది : 15-02-2022
శీర్షిక : మమకారాల ఒద్దికైన బడి
కవితసంఖ్య : 217
కానుపుతో మరో జన్మ
అయినా వెరవదు అమ్మ
రక్తమాంసాలు రంగరించి
బిడ్డలకు పాలందిస్తుంది ....
తొలి ఊయలై.. జోలపాటల
నిదురకు పానుపవుతుంది
ముద్దు ముద్దు కబుర్లతో
మురిపాలను అందిస్తుంది ....
ఆకలి తీర్చంగా అన్నపూర్ణయి
ఆటలు నేర్పంగా ఆత్మీయత పంచు
మాటలు బోధించగ గురువుయి
మమతలు చూపించగ మందిరమే ....
నిశ్చింతగా నిదురించాలన్నా
నిర్భయంగా ఆడుకోవాలన్నా
నెలలు నిండిన పాపాయికి
సుమ సమమైన సుందర పాన్పు .....
అమ్మ ఒడి అదే మన తొలి బడి
బుల్లి బుల్లి మాటలను పదే పదే
వల్లిస్తూ ... బుజ్జగించి తానై నేర్పిస్తుంది ....
తప్పొప్పులను సవరించుకుంటూ
తన్మయత్వాలను అందిస్తుంది ......
ప్రతివారికి అద్వితీయమైన కానుక
ప్రపంచంలోనే ప్రత్యామ్నాయమంటూ
లేనిది ...
అపూర్వమైన మమకారాల
ఒద్దికైన బడి .... అమ్మ ఒడి
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment