Tuesday, July 12, 2022

నేనో వెలుతురు నదిని తేది: 09-02-2022 శీర్షిక : నేను నాగరికతను ....

 నేనో వెలుతురు నదిని

తేది: 09-02-2022
శీర్షిక : నేను నాగరికతను .... 
కవిత సంఖ్య: 843

చీకటి గుహల చిక్కుముడులను బాపి 
ఒక్కొక్కటిగా విడగొడుతూ.. భళ్ళుమని 
ఒళ్ళు విరుచుకుని.. సంస్కారాలు నేర్పిస్తూ 
తలెత్తుకుని నిలబడేట్టు చేసాను ...మనిషిని ...  

రాతి పనిముట్లతో రాటుదేలనిచ్చి 
చక్రం కొడవండ్లతో  పనులన్నీ చక్కబెట్టి ... 
పశువులను మచ్చిక చేయించి....  
ఎవుసం నేర్పించి .... గాసం రంది బాపాను ... 

నదీ తీరాలను తడిమి తడిమి 
నగరీకరణలతో  నవ జీవన విధానాలనిచ్చి 
గుంపులు గుంపుల బతుకు నీడలలో  
జీవన గమనపు  అడుగులు వేయించాను .... 

జనాభ  పెరుగుదలలకు దీటుగా నిలువ ..... 
పంట పొత్తిళ్ళలో రసాయనాలు పంచి... 
తిండి తిప్పళ్లు పెంచి ...  కట్టుబట్టల్లో 
కొత్తదనాలను మూటగట్టి నడిపిస్తూ ....  
పారిశ్రామికీకతలో పరుగులు  పెట్టించా ... 

గ్రహాంతరాలపై ఆసక్తులు రేపి 
సాంకేతికతల సొబగులద్దుతూ  
మానవాళి ఆలోచనల వేగాలకు సరితూగ ... 
కృత్రిమ మేదస్సులతో  కులాసా కబుర్లకు 
తెర తీసాను ..... 

నేనొక  నిరంతర వెలుగు నదిని 
జీవరాశిలో ... మానవాళిని  మిన్నగా 
ఉంచాలనే తపనల తపోసంపత్తిని... 
అడుగడుగున మనిషిని కనిపెట్టుకుని
అధి  శిఖరం పైకి అడుగులు వేయిస్తుంటాను  ..... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment