Tuesday, July 12, 2022

ఒక పలకరింపు తేది: 16-02-2022 శీర్షిక: కాగడాల వెలుగు ....

 ఒక పలకరింపు

తేది: 16-02-2022
శీర్షిక: కాగడాల వెలుగు .... 
కవిత సంఖ్య: 849

ఎనభై ఏడు లక్షల జీవరాశిలో విశిష్టం 
మానవాళికి మాత్రమే సొంతమైన వరం 
మోదములకు  ఉబ్బి తబ్బిబ్బవుతూ
ఖేదములకు కొంత  కలవరపడిపోతూ….  
రాగ ద్వేషాలకు రంజిల్లు మానసం ..... 

సుందరమైన సుఖాల సమయం కన్నా 
కష్ట నష్టాలతో కలబడుతున్నపుడు
దుఃఖ సాగరంలో మునిగి పోయినప్పుడు 
అయినవాళ్ళ ఆత్మీయతల పలకరింపులే
మధువులొలకబోసే చిలకరింపులు… 
అనారోగ్యాలకిచ్చే ఔషధ లేపనాలు…. 

మమతలు నిండిన మాటా మంతీయే 
మానవ సంబధాలకు  మనసైన వారధి....  
మనిషితనానికి  మరో నూతన రూపం .... 
మంచితనానికి ఎనలేని మచ్చుతునక ....

కాల మాన పరిస్థితులలో కాటేసిన 
గాయాలకు మాటే మంత్రమై.... 
ఎడారిలో సేదదీర్చే ఒయాసిస్సులా…. 
డబ్బులతో కొనలేని అమూల్యం.... 
జబ్బులెన్నింటినో తగ్గించే ఔషధం ....  

ఆలోచనల అంకురాలకు కేంద్రమై 
ఆశలను చిగురింపజేసి ... ఆశయాలను 
చేరుకునే గమన శీలతలనిచ్చి .... 
గమ్యాలకు చేరువలు చేకూరుస్తుంది ..... 

నిర్జీవపు పరిసరాలను తరిమికొట్టి 
కోకిల రాగాలకు మధుమాసమై
నూతనోత్తేజాలకు  ఇంధనమై 
ఇనుమడించిన వేగ తుల్యాలతో  
నిశి చీకట్లను తరిమి కొట్టగలిగే 
నూరు కాగడాల వెలుగులు నింపు ..... 

నగునూరి రాజన్న 
కరినగరం 

No comments:

Post a Comment