అంశం - పెరటి చెట్టు
తేదీ 27-06-2019
శీర్షిక - వైద్యానికి ప్రాణం ....
సంఖ్య - 221
తనకున్నది తృణీకారం
లేనిదానిపైననే మమకారం
సహజ గుణం మానవ నైజం
నిజమెరుగుట ప్రతివారి ధర్మం ....
ఆత్మీయత నిండిన అమ్మ పలకరింపు
అనురాగంతో మందలించే నాన్న కేక
అంబంధాలొలికించే తోబుట్టువుల లోగిలి
అనుక్షణం గుర్తొచ్చే అందమైన పరిసరాలు
అక్కున చేర్చుకునే ప్రియమైన బంధు బలగం
ఆరా తీసి అనునయించే ఇరుగు పొరుగులు
అడుగు బయట పెడితే కాని అర్థం కావు......
ముత్యమంటి అక్షరముల ముగ్ద మోహనం
ముద్దులొలుకు మధుర భావాల రస రమ్యం
పాలు మీగడలకన్న పంచదార చిలకలకన్న
తేనె ధారలకన్న మన మాతృభాష మిన్న
అచ్చులతో అంతమయ్యే అందమైన భాష
ప్రపంచ ఉత్తమ ద్వితీయ లిపిగా జిలుగు వెలుగులొందే ...
జాతి మొత్తానా తృతీయ వాడుక భాషైనా.....
నేడు ఉనికి పోరాటాల ఊపిరై నిలిచే ....
వేదాలలో నిక్షిప్తమంటే హాస్యం
వెలికి తీసిన పరదేశీయులంటే గౌరవం
విమాన పరిశోధక రైటు సోదరులైనా ....
విచిత్ర కృష్ణబిలాల సిద్ధాంత కర్తలైనా .....
ఇకనైనా పెరటి చెట్టు వైద్యానికి ప్రాణమందాం....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment