Thursday, June 27, 2019

గోడలకే ప్రాణం ఉంటే.... 2

అంశం - గోడలకే ప్రాణం ఉంటే....
తేదీ 07-06-2019
శీర్షిక - ముచ్చటిస్తాయి కూడా....
సంఖ్య - 205

ఈ రోజుల్లో పైసలుంటే పనులన్నీ తయ్యార్
ఒకప్పుడైతే  మంటి పనికైనా ఇంటివాడే అందుకే...

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు
మట్టి గోడల నాటి మతలబుల మాట
గుడిషో పెంకుటిల్లో బాల్యపు దాగుడుమూతల నుండి
వృద్ధాప్యపు నీలి నీడల వరకు వెన్నంటే....
గుండెల్లో గుడి కట్టుకునే ఆప్యాయతల అనురాగాల  మూట

అవనిపై చేరినది మొదలు అత్యవసరాలలో మూడవదిగా
అపసోపాన  అమర్చుకుని అదే లోకమై తరించే వాళ్ళు ....
అమ్మలు అమ్మమ్మలు ఆ  గోడలకు రేవ  అలికి
ఆర్తి దీర ముగ్గులు పెట్టి ఆప్యాయంగా అందించేవారు
రాబోవు తరాలకు వారధిగా ...

బంధువొచ్చినా విందు సంబరాలకు
పెళ్లి పేరంటాలకు  రహస్య మంతనాలకు
మంచి చెడుల మతలబులకు  
కష్ట సుఖాల కడలి కెరటాలకు
కలిమి లేములకు నిలయమై
రాత్రి పగలు సాక్షీ భూతమై
ప్రాణమున్న మనిషిని ప్రతిక్షణం  అంటిపెట్టుకుని
కంటికి రెప్పలా కాచుకున్నది ప్రాణం కన్నా మిన్నగా....
.
మనోవేత్తల మాట ప్రతి దానికి భావన ప్రాణాలుంటాయని .....
వినే మనసుండాలి గాని గోడలు కూడా ముచ్చటిస్తాయి....నేస్తమా !

నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

No comments:

Post a Comment