Thursday, June 27, 2019

వీళ్ళింతే

అంశం - వీళ్ళింతే 
తేదీ - 06-06-2019
శీర్షిక - వీరంతా... ఇంతే... 
సంఖ్య - 204

ప్రజా సేవ ముసుగు పక్కాగా కప్పుకుని 
ప్రజలే మా పరమావధి అంటారు.. 
ఖద్దరు కండువా ఏదైనా మంచిదే  
ఖదర్ నిండుగా ఉండాలంటారు ... 

గెలిచినా ఓడినా సిగ్గు లజ్జా జాన్తా నహీ 
గెలిస్తే బాహాటంగా ఓడితే గోప్యంగా 
గల్లలెగరేసి గల్ల పెట్టెలు నింపుకోడానికి 
గుంజుతారు ప్రజలనుండి జలగల్లా... 

సహాయక ఉద్యోగానికి సైతం 
సదువు ఎంతో కొంత కావాలంటారు..
చేరికకు, నిష్క్రమణకు వయసు నిర్దేశిస్తారు  
సదువు సంధ్యలు, వయసు మాట, పెట్టుబడి మూట 
అక్కరే లేని పెద్ద తలకాయల ఉద్యోగాలివి ...

ప్రతి గెలుపుకు పరోక్షం అతివే అంటారు 
వేదికలెక్కి బాకాలు ఊదుతారు .... 
ప్రత్యక్షంగా వారికివ్వాల్సిన అర్థ వాటాకు 
పనికొచ్చే మాట చెప్పరు, చేత సాయం  చేయరు ... 

సంధి కాలం అధిగమించాలి 
యువత  తాను సంధించుకోవాలి 
ప్రజా క్షేత్రాన్ని పవిత్రం చేయాలి 
ప్రగతి రథాన్ని పరుగు పెట్టించాలి...  
అంతవరకు.....వీరంతా ఇంతే .......


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

No comments:

Post a Comment