Saturday, June 1, 2019

భావ తరంగాలు

అంశం - భావ తరంగాలు 
తేదీ 24-05-2019
శీర్షిక - అందమైన కవితకు ...  
సంఖ్య - 194


అక్షరాలు అమర్చి  పదాలు పేర్చి 
అందమైన వాక్యాలు, ఆర్ద్రత  భావాలతో  
అల్లుతూనే ఉన్నాను  కవితలు... 

కంటికి కనిపించిన,చెవులకు వినిపించిన  
మనసుకు నచ్చిన మతలబులే  కావొచ్చు 
చికాకు కలిగించిన చిక్కు ముడులూ  కావొచ్చు 

ఆరాటమే ఎక్కువై అందంగా పండించలేక  
ఆత్మీయంగా   ఆవిష్కరించలేక 
తాపత్రయ పడుతూనే ఉంటాను కొన్నిసార్లు...

అలౌకిక ఊహలను అపురూపంగా ఒడిసిపట్టి 
ఉన్నఫలంగా ఉరకలు పెట్టించి ఉత్సాహం నింపాలని  
తదేకమయిన తపనతో  తంటాలు పడుతూనే ఉంటాను...  

ఏకరువుగ లెక్కించగలిగి ఎరుక  సంఘటలైనా 
ఊపిరాడక  ఉసూరుమనే  ఊసులతో కొన్నిసార్లు 
మనసుకు రెక్కలొచ్చి మరోలోకంలో విహరిస్తూ .... 
అరక్షణంలో అందంగా అమరిపోతుంది.  

అమ్మ బాసర హంస వాహిని భావానికి బానిసనై
అంతర్మథనముతో ఆర్తిగా అవలోకించుకుని 
ప్రతి కవితను పదే  పదే పునశ్చరణ గావించుకుని   
సమున్నత  హిమ శిఖర సమంగా తీర్చి దిద్దుతూ 
సదా తన్మయత్వం పొందుతూంటాను సుమా ...   

No comments:

Post a Comment