Wednesday, June 11, 2025

పదవీ విరమణుల మనోగతం.

 పదవీ విరమణుల మనోగతం.


విరిసీ విరియని విజ్ఞానంతో 
విరజాజుల పరిమళాలుగా 
విశ్వాన్ని జయిద్దామని 
వివిధ వయసులవారీగా 
అడుగిడినాము ఎన్టీపీసీలో ... ఆనాడు .. 

మైదానములోనే దిగినాము 
కష్టం సుఖం కలబోసుకున్నాము ... 
పునాది రాళ్లుగా మారిపోయి 
పునీతమయ్యాము జీవితాన ... 

వేల ఎకరాలలో విస్తరించి 
పచ్చని చెట్లుగా మారాము ... 
ఇటుక ఇటుకను పేర్చి మేము 
ఇండస్ట్రీకి రూపురేఖలమయ్యాము ... 

చీమలలా క్రమశిక్షణమయమై  
స్వేదాలను ధారపోసినం .... 
రుధిరం రంగరించి మేమంతా
వెలుగు బాటలు పరిచినం .... 

తలలు వంచి నిత్యం పని చేసినా 
తలెత్తుకునే వంద అడుగుల 
చిమినీలను కట్టాము.... 
పర్యావరణం పదిలపరిచాం ... 

నాదనుకొని నగారా మోగించినా 
మనదనే భావం నింపుకున్నాం .... 
పరిశ్రమలో పట్టుదల చూపించి 
సేవలు మెండుగా చేసాము .... 

దగ్గు జలుబులు లెక్కచేయక 
బొగ్గుచూరను ఎర్రగా మండించాం ... 
అందనంత ఎత్తుల్లో నిలిచి 
బాయిలర్ లను బరబరా వెలిగించాం ... 

రావాటర్లో ధాతువులను  తీసేసి 
కవాటాలలో నీటిని బంధించి 
పైపులలో గలగల నీరు పారించి 
ఆవిరి సెగలను ఉవ్వెత్తున లేపాము ... 

మరిగే రుధిరం లెక్క చేయక 
టర్బయినుకె సరిదంటగా జోడించిన 
జనరేటర్లోకి పంపగానే కిలోవాట్లుగా 
విద్యుత్తు వెలుగులు విశ్వానికి పంచాము…

వయోబేధములు మరచిన మేము 
వడి వడి అడుగుల నడకలు సాగించాం…. 
అనుపానులను పొదువుకుని 
అడుగడుగున మెరుగులు దిద్దాం… 

ఉత్పాదకతలను ఊపిరి చేసుకుని
ఆపదలెన్నో గట్టెక్కించి నడిచాం…. 
కొత్త తరంతో కలిసి అడుగులేస్తూ
మిషనులెన్నున్నా విజను విడువక
కొంగొత్త గమ్యాలను కోరి జయించాం..

పి ఎల్ ఎఫ్ లు ఛేదించుటలో
పగలు రేయిలు పరితపించాము…
పిట్ట కొంచెం కూతఘనములా
వటుడింతింతై వామనమూర్తిగ ఎదిగాము… 

లెక్కలేనన్ని అవార్డుల సాధనలో
ప్రమిదలమైనాము…సమిధలమైనాము… 
పుష్కలమైన పురస్కారాలు
పొందుటలో పూవులమైనాము… 
పూతావులమైనాము…. 

పునాది పూజల మొదలైన మేము
అనాదిగా శ్రమ వీరులమే…. 
మా మనాదులన్నీ పారద్రోలగా
నిత్యం శనార్తులే కంపనీకెపుడు… 

కులమేదైనా కలిమే మేమంతా .... 
భాషేదైనా భువనమే మేమంతా… 
ప్రాంతమేదైనా క్రాంతి దర్శనమే…  
శ్వాస ధ్యాస అన్నీ జిలుగు వెలుగులే…. 

పరిశ్రమలెన్నింటకో ప్రగతిమార్గమై  
దేశమాతకు తలమానికమైన  
ఎన్టీపీసీలో చేరిన మేమంతా 
ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నాం .... 

నియమంగా అరువది నిండగానే 
నిష్క్రమణలు మొదలాయె…. 
అయినా అలుపెరుగని అనుభవజ్ఞులం
అయినా మమత తీరని విశ్రాంతులం… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment