సమూహ సంఖ్య : 41
అంశం : విముక్త గీతం
తేదీ ; 06-09-24
శీర్షిక : ఎప్పుడు ?
అమ్మకు ప్రతినిధిగా
ఆత్మీయతలకు మరో రూపం .... .
చెల్లిగా అనుబంధమై
అనురాగానికి నిర్వచనం ....
ఆలిగా అవతరించి
త్యాగానికి తరగని చిహ్నం....
అణకువలో ఆరితేరి
ఓర్పుకు తానే దిక్సూచి ....
ఇంటిల్లిపాదికి అన్నీ తానై
అందుబాటవుతూ అమిరిపోవు
తలలో నాల్కవలె ...మన తప్పులను
తాను దులుపుకుని తలదించుకునిపోవు .....
ఇల్లే ప్రపంచమనుకుంటున్న
ఇంతులకు బాధలు ఎంతని
తెలుపగలము ... ఎలా మొదలెట్టి
ఎక్కడ లేవని నిర్వచించగలము .....
గృహ సీమనే విశ్వంగా
మలుచుకుని....కుటుంబమే
తనదిగా చేసుకుని... అమ్మగా ...
భార్యగా ... చెల్లెలుగా ... కూతురిగా ...
ఆలిగా అన్నీ తానై ఇమిడిపోతున్నా ....
అధికారంలో ఉన్నా లేకున్నా
ఆకాశంలో సగమనడమే కానీ
అందని ద్రాక్షాపండ్లుగా
చేయడమే అంతిమ లక్ష్యం ...
నాగరికతలో అడుగులేసుకుంటూ
నరకాసురులు అవతరిస్తుంటే ...
పారిశ్రామికతలో ప్రగతి సాధిస్తూనే
పశు ప్రవృతిని మానుకోకపోతే ....
సాంకేతికతలో దూసుకుపోతూ
సన్నాసులకు కొదువ లేకుండా పోతుంటే…
అనాధలా అరిచి గీపెట్టినా
పట్టీ పట్టని వ్యవహారాలైపోతుంటే…
అక్షరాస్యతలో నిరక్షరాస్యతలో
అలసత్వాలో నిర్లక్ష్యాలో
వరించిన అధికారదాహాలతో
విరించి కానుకలను విరిచేస్తూ
బలవంతంగా లాగేసుకుంటుంటే
ఇక విముక్త గీతం పాడేదెప్పుడు ?
పాడుకునేదెప్పుడు ?
నగునూరి రాజన్న
కరినగరము ( రిచ్మండ్ VA )
No comments:
Post a Comment