Tuesday, June 17, 2025

పాడుదమా స్వేచ్ఛాగీతం 05-09-2024

 పాడుదమా స్వేచ్ఛాగీతం

05-09-2024

పాడుదమా స్వేచ్ఛాగీతం

ఎగరేయుదమా జాతిపతాకం

దిగంతాలు నినదించి   
విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం  
|పాడుదమా|

జలియన్ వాలా బాగు దురంతపు 
నెత్తుటి ధారలు హత్తుకొని
ఉరికొయ్యల చెరసాలల గోడల
దారుణాలు తలకెత్తుకొని
పొగిడిన కాలం   పోరాడిన కాలం 
మరి మరి ఒకపరి తలచుకొని 
మృత వీరుల గాధలు తెలుసుకొని  
|పాడుదమా|

వందేమాతరమని నినదించిన
వీరుల శౌర్యం తలచుకొని
స్వాతంత్రం నా జన్మహక్కని
గర్జించిన  గళమందుకొని
పోరాట ఫలం స్వాతంత్ర ఫలం
కలకాలం కాపాడుకొని
కడు గర్వంగా కొనియాడుకొని  
|పాడుదమా|

మన్యం గుండెల మంటై రగిలిన 
విప్లవ జ్యోతి స్ఫూర్తియని
గుండు కెదురుగా గుండె నిలిపిన
తెలుగు సింగముల తెగువగని
చీకటి గుండెల బాకై మెరిసిన
గరిమెళ్లను గురుతుంచుకొని
మన తెలుగు తేజమును నింపుకొని  
|పాడుదమా|

జనగణమనముల జాగృతినింపిన
జెండా గాథలు చెప్పుకొని
జయహే జయజయహే జననీ యని
జయ గీతమ్ములు పాడుకొనీ
పావన చరితం పరిమళభరితం
అఖండ భారత ఖండమని
అది అక్షయ అమృతభాండమనీ  
|పాడుదమా|

--
నగునూరి రాజన్న 
కరినగరము  ( రిచ్మండ్ VA ) 

No comments:

Post a Comment