సహచరిమయం
తేదీ : 27-08-2024
శీర్షిక : ఒక జీవితం
విశ్వంలో విరామమెరుగని వింతలా
సూర్యుని చుట్టూరా తిరుగుతున్న
భూమిలా....చూపులు కలిసిన శుభవేళ
మొదలైన ఆలోచనలన్నీ అదే తంతు...
ఆ ముహూర్తమెంత బలమైనదో
చూపులతోనే నను నడిపించినది
తన నడకలతోనే నిశ్శబ్ద బోధనలు…
బోధనలన్నీ మేలిమి రకాలే…
ప్రేమ నిర్వచనం పెద్దగా తెలియకున్నా
సూదంటురాయిలా చూపుల బాణాలతో
ఇచ్చి పుచ్చుకున్న ఇలవర్షల మనసులు
ఎదురుచూపుల పర్వమే వత్సరాలకొద్దీ ...
ఉద్యమాల కాలపు చదువులలో
ఒక పక్క పుస్తకాల కుస్తీలో మునిగితేలుతూనే....
ఉచిత సమయాలలో నన్ను
నిలువెల్లా ఉడికించిన ఆలోచనలే ....
అంతిమంగా అనుకున్న ఘడియ
రానే వచ్చింది. ముహూర్తం
కుదిరింది... మురిపాలను తీర్చింది ...
ముద్దు ముద్దు ఆలోచనలకూ శుభం
కార్డు పడింది...సుందరమై ముడిపడింది ...
ముడిపడిన నుండి వడి అడుగులే
ప్రతి అడుగులో పట్టుదలలకు
పెద్ద పెట్టుబడి అయ్యింది ....
అడుగడుగున విజయాలు సాధించాలన్న
విస్తృత ఆలోచనలకు మూలమైంది ....
ఉద్యోగ బాధ్యతలలో ఊపిరాడకుంటే
ఇంటి నిర్వహణలో ఇగురశాలయ్యింది…
ఆర్థికాంశాల కేటాయింపుల్లో మంత్రయ్యి
పిల్లల బోధనలతో పంతులమ్మయ్యింది
ఆనందాలలో నాకు రెండు కళ్ళై
బాధలలో ధైర్య వచనాలైపోయి
సంఘములో సదా సమున్నతమై
పరిపూర్ణతల పయనం వైపే అడుగులు…
గుండు మల్లెల గభాళింపులతో
మరవం దమనం పరిమళాలతో
ఫరిడవిల్లే మా కుసుమసహృదయ
సుందర పొదరిల్లు మననభరితం…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment