నవ జీవన రేఖలు
తేది : 28-08-2024
శీర్షిక : పిడికిట విశ్వం మాయాజాలం
కాలరేఖల కనుసన్నల్లో
నడవాల్సిన నవ జీవన రేఖలు…
కన్ను మిన్ను కానక
అనుభవాలను అపహాస్యం చేస్తూ…
నాగరికత నడకలలో
గాడి తప్పి పోయిందనుకుంటే ...
పారిశ్రామిక ప్రగతిలో
గతి తప్పిన దాఖలాలే ....
సాంకేతికత కనుసన్నల్లో
కాట కల్సిపోవుచున్నది ....
పిడికిటి విశ్వం బిగించుకుని
పీల్చి పిప్పి చేస్తున్నది ....
మసక చీకటి వెలుగుల్లో
చరవాణి ముసుగుల్లో
పగలు రేయి పహారాలు
కన్నార్పని కొక్కిరాయిలే ....
మాటా మంతీ నోచుకోని
మల్లె సుగంధాల మమతల తీగలన్నీ
అపస్వరాలతో అలరారుతూ
విసిగి వేసారుతున్నవి ....
బంగారు బాల్యాన్ని సైతం
బలవంతంగా లాక్కుని
తన ఇనుప సంకెళ్ళలో బంధింపజేసి
తెరలకు కండ్లప్పగింపజేసి
మత్తు మందు చల్లుతున్నది ....
యువతను పెడత్రోవల తోసి
కను విప్పులను కాల్చేసి కూల్చేసి ....
పెను ముప్పును వాకిట నిలిపి
పెద్ద సవాలును విసురుతున్నది ....
అతి సర్వత్ర వర్జయేత్ లాగ
ఉనికి కోల్పోని మోతాదులో
ఉన్నతమైన విలువలు కూడి
మోదమైన విషయాలకు
వాడుకుంటేనే మంచిది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment