Thursday, August 10, 2023

నేను ఒక జీవన వాక్యం తేది : 20-12-2022 శీర్షిక : దర్శనీయం ....

 నేను ఒక జీవన వాక్యం

తేది : 20-12-2022
శీర్షిక : దర్శనీయం .... 
కవిత సంఖ్య : సహస్రాధికం 
 
నిరక్షరాస్యతల నీలి నీడలలో పొదగబడిన  
పల్లె పక్షిని  ... అక్షర సూర్యునిగ వెలుగులు 
విరజిమ్మాలనే బలీయమైన అమ్మ కోరికకు 
అనుసంధానమై.. అకుంఠితమై దీక్ష బూని సాగాను  ...  

బుద్ధినేర్చిన పొద్దులనుండి ప్రత్యక్షంగా 
అమ్మా నాన్నల కష్టాలను కళ్లారా చూసి 
కాలానికి మౌనంగా సాక్షినై....ప్రతి అడుగు 
పదిలంగా వేయడం నేర్చుకున్నాను... 

ఉన్నంతలో సౌకర్యాలను ఉన్నతమై 
అందిపుచ్చుకుంటూనే ...పక్క గ్రామంలో 
పది వరకు... కాలి నడకల కానిచ్చాము 
ఉన్నతపాఠశాల విద్యలను ఉత్తమంగా .... 

నిప్పుల కొలిమిలా ఉప్పెనైన తెలంగాణ 
ఉద్యమ దావానలంలా  కూడా భంగపడని 
ఉత్తీర్ణతలందుకుని...పట్నం ఛాయలలో 
మిడతంబొట్లమైనా ....అటు కన్నవారి కలలు 
పండించడంలో కృతార్థుడనై దీవెనలంది...  
ఇటు జీవిత బాటలో పయనమయ్యాను .... 

ఇరువదొక్కోవ ఏటనే అడుగులు పడినా ... 
నాలుగు సంవత్సరాలలో మూడు ఉద్యోగాలు 
మారిపోయి నాల్గవ దానిలో స్థిరపడి నలుబదేండ్లు 
నల్లేరు పై నావలా సాగిపోయింది జీవన పయనం ... 

కాలం కలసి వచ్చినట్టుగా ...మాట కల్సిన 
మంత్రిగా సహచరి ...మాటే వేదంగా కదిలిన 
సంతానం... కొదవలేని స్థిరత్వములో వైపు  ... 
మాతృ సంస్థ సహకారంతో ఓ ఇంటివాడిని 
కూడా అయిపోయి....మరోవైపు .... కడుపులో 
చల్ల కదలని ఆసామిలా సాగిన పయనం 
దాదాపుగా జీవనవాక్యమై దర్శనీయతే ఈ నాటికి .... 
 

No comments:

Post a Comment