Thursday, August 10, 2023

అవినీతి నిర్మూలన శీర్షిక: నీతి నిరోధకం. Dec., 22

 అంశం: అవినీతి నిర్మూలన

శీర్షిక: నీతి నిరోధకం.

నీతి కళ్ళగంతలు కట్టించుకుని
ఏటో వెళ్ళిపోయిందని విన్నా..
కుర్చీల పంపకాలు మొదలై
రంగుల కండువాలు కప్పుకున్నాక..!

కులపు కంపులో యథేచ్ఛగా
ఈదుతున్న  రెండుకాళ్ళ జంతువుల్ని చూసి
నీతి  తనభుజంపై ఉన్న నిజాయితీ
కండువాను జారవేసుకుంది..

కార్యాలయం ఏదైతేనేం
ఇచ్చిపుచ్చుకోవటాల్ని గూర్చి
బల్లలు తెగమాట్లాడుకుంటున్నాయని విని
ఆ గడపల మొహం చూడనని ఒట్టేసుకుంది

చట్టాలు లోపాయికారితనానికి
అమ్ముడుబోయి...
"అవి "నీతికే  మొగ్గు చూపుతుంటే
తాను తరాజస్త్ర సన్యాసం పుచ్చుకోవడంలో
వింతేముంది..

ఊర్లకు ఊర్లను పంచేసుకుని
అడవుల్ని ఆక్రమించుకుని
శ్మశానాల్లో  చితుల్ని టెండరేసుకుంటుంటే
తను సమాధిలో మౌనంగా దాక్కుంది..

ఏడాదికోసారి  అవి"నీతి నిరోధకం" సజావుగా సాగిందని కూడళ్లలో చేరి కూస్తోంటే..
చిప్పిల్లిన కళ్ళతో తన చిరునామా వెతుక్కుంటోంది..!

No comments:

Post a Comment