Thursday, August 10, 2023

చిత్ర కవిత తేది : 12-12-2022 శీర్షిక : అన్నపూర్ణ

 చిత్ర కవిత 

తేది : 12-12-2022
శీర్షిక : అన్నపూర్ణ 
కవిత సంఖ్య : సహస్రాధికం 

మట్టిని ముద్దాడిన ఆ పాదం 
ఎన్ని శ్రమలకు ఓర్చుకుని మార్గమేసిందో ...
ఎంత అనుభవం రంగరించుకుందో 
ఎన్ని సునిశిత దృశ్యాలకు  రూపు దిద్దుకుందో ... 

పనిలో ఘనమైన నాతి పాదం 
పంటపొలములో దిగిన ఆనవాళ్లు 
స్వేదం చిందించి చెమర్చిన మేను 
అన్నపూర్ణ హస్తమై దీవించు ... 

మడిచిన పాదమున మనసు దోచే 
కల్యాణ సాలంకృత కడియాలు 
కలికి మాలక్ష్మికి కనువిందు కాలి పట్టాలు 
ఐదోతనమునకు సంకేతమౌ  మెట్టెలు...  

మనసున నిక్షిప్తం చేసుకుని ...
మహిమాన్వితమై చూసిందో..తలచిందో...   
కర్రను తొలిచి కనువిందు చేసినంతగా 
మనసు కరిగించిన శిల్పి నైపుణ్యం...  

కాన్వాసుమీద అలవోకగా కదిలిన కుంచేలా ... 
కాగితంమీద కదిలించిన  కలంలా ... 
అలవోకగా గిరి గీసిన చిత్రంలా .. 
అపురూపం  అపూర్వం శిల్పి ప్రతిభా పాటవం .. 

అమ్మను తలుచుకున్నాడేమో...  
శ్రమను మననం చేసుకున్నాడేమో ... 
ఆభరణాల నాడి పట్టుకున్నాడేమో ... 
అపురూప ప్రదర్శన ఆ శిల్పి ఉలిలో ... 

అచ్చంగా చిత్రమంతా  అవపోసన పట్టినట్టు ...
శ్రమించి నీరసించి మడతపడిన పడతి పాదం 
మహనీయంగా మట్టి కొట్టుకున్న మరకలతో సహా...  
కనులకు కట్టినట్టు కనికట్టు చేసిన కావ్యం...  
అనన్యమైన శిల్పి నైపుణ్యానికి శిరసువంచి 
మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment