ఆత్మావలోకనం
తేది : 14-12-2022
శీర్షిక : మానవ కళ్యాణమే ....
కవిత సంఖ్య : సహస్రాధికం
కలిమాయలో... కాలమహిమలో...
మంచి మంచియన్ని మన ఖాతాలో
బాగో లేనియేవైనా పక్కోళ్ల జేబులోనే ...
స్వార్థాలను అందిపుచ్చుకున్నంత చౌకగా
సత్యాలను అక్కున చేర్చుకోరెందుకో ...
ఆత్మ సాక్షి అరిచి గీపెట్టినా
ఆవలకు నెట్టేసి...మంచికంతా నేననే
అహంభావము నిండిన అవతారాలే
అక్కడా ఇక్కడనే కాదు ... ఎక్కడైనా .....
కడతలో కొలువైన దైవానికి మొక్కి
కష్టాలను తీర్చమనే మనుషులు
కర్మలను కూడా చూస్తుంటాడని
కనిపెట్టలేకపోతున్నారెందుకో ...
మహానుభావులకు మాత్రమే
వశీకరణం అనుకుంటాము ....
మనం కూడా ప్రయత్నించి
సాధించవచ్చని తెలుసుకోలేమెందుకో ....
వేలు ఒకటి ఎదురుగా చూపిస్తుంటే
మూడు వేళ్ళు మనవైపే చూపిస్తున్నయన్న
విషయాన్ని ముచ్చటగా పట్టించుకోక ...
గమనించక ...గమనించి కూడా నటనలేనో.....
ఒక్క క్షణం ఓపికపట్ట గలిగితే ...
మూలలను విశ్లేషించుకోగలిగితే...
చిన్నా చితక అంతరాలే కాదు
పెద్ద పెద్ద యుద్ధాలను సైతం
అధిగమించవచ్చు.
అడుగడుగునా మనిషి ఆత్మావలోకనం
చేసుకోగలిగితే ...పదిలమయే కర్మలతో...
పర నిందలు కానరాక ... పరమానందమే
అంతా మానవ కళ్యాణమే ...
నగునూరి రాజన్న
కరినగరము (రిచ్మండ్)
No comments:
Post a Comment