Thursday, August 10, 2023

వెలుగు చూడని వార్త తేది : 22-12-2022 శీర్షిక : రామప్పలు ....

 సమూహ సంఖ్య : 41 

అంశం : వెలుగు చూడని వార్త
తేది : 22-12-2022
శీర్షిక :  రామప్పలు .... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ప్రజాస్వామ్యపు తోటల తోపులో 
మధురగానాల కోయిలమ్మలు .... 
పాలన తీరులన్నీ రాజరికాలే ... 
పలుకులన్నీ రామచిలుకలవే ... 
అంగాలెన్నున్నా వంగదోలుడే...  

అదనుగానున్న అర్ధబలమైనా 
మందలుగా నున్న అంగబలమైనా 
కోటరీలలో కునారిల్లె అధికారబలమైనా
పట్టుబట్టి బట్టీ పట్టించారంటే... వారి  
కనుసన్నల్లో కాలం వెళ్లదీయాల్సిందే.... 

చరితలన్నీ తరిచి చూస్తే 
ఊసులన్నీ ఉన్నోళ్ల చుట్టే... 
కాలమేదైనా కలం పనెప్పుడు 
కలిమి కలిగినోళ్ల వత్తాసులే ...
కడుపులు నింపని జోలపాటలు ....  

ఇవేవీ లేని పేదోళ్లు ఎవరైనా సరే 
ఇరకాటంలో పడి ఈదుకోవల్సిందే ... 
ప్రాణమిడిసిన ప్రధానమంత్రైనా సరే 
మరునిమిషం ఏమీలేని అనాధలే ...  

కాలం కలిసిరాని సమయంలో 
కట్టే పామై కరిచినట్టు ...అంతా కనికట్టే ... 
రాళ్ళెత్తిన ఎంతో మంది కూలీలలో 
ఎంతమంది రామప్పలయ్యారు....  

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

No comments:

Post a Comment