Sunday, September 5, 2021

వారసత్వం 2 18-02-2020

 వారసత్వం 2 

18-02-2020

నరుడే వానర రూపాంతరమని 
నాటి రాతి యుగం చీకటి మయమని 
చక్రంతోనే జీవనగతి మారిందని .... 
ఆటవికం ....ఆధునికానికి మారినా..... 
అంతా గడచిన చరిత్రే  అయినా .... 
మంచి చెడుల సమాహారమే మన వారసత్వం....
మననం చేసుకుంటే... మిత్రమా !

అడుగు తీసి అడుగు వేస్తూ .... 
అంతరిక్షం దాకా చేరుకున్నా..... 
అప్పుడప్పుడు ఆలోచన చెలిమెల నీళ్లు 
తోడుకుని  గొంతు తడుపు కోవాలనిపిస్తుంది.... 

పచ్చి మాంసాల  ఫలహారాలు వద్దని  
యాదృచ్ఛికమై కాలెనో …. కాల్చి…. 
వండి వార్చుకునే....పద్ధతి మార్చుకున్నా ....
వడివడిగ అడుగులేసారేమో .... కొంతమంది
 
వడపోతల వస్త్రగాయితాన వశపరచుకోను 
అవపోశన పట్టిన ఆరోగ్యాల అచ్చట్ల ముచ్చట్ల
పరుగు లంఘించి....ఫక్తు శాకాహారులైనారేమో....

మత్తు పానీయాల చిత్తడి నుండి ....  
పనిగట్టుకుని పట్టు తప్పించుకుని 
పలాయనం చిత్తగించారేమో...నచ్చనోల్లు ....

ఒడ్డు పొడుగులోన ఒక్క పోలిక లేవు 
ముద్ద నోటికందించుటలో ఒద్దికనే  కదా ! 
ఐదు వేళ్ళు మనకున్న చేతులవి .... 
ఐక్యత చాటే కదా ఆ క్షణమున ..... 

తారతమ్యముల తన్నులాటలన్నీ 
తప్పక అవగతమౌను కదా..... 
మనసుబెట్టి చదివితె  మన చిన్ననాటి   
మూడు చేపల కథ ముచ్చటగా..... 

అంటు ముట్లన్న ఆరాటమైతేనేమి 
ఆలింగనాల ఎంగిల్ల  వివక్షలైతేనేమి 
అంటూ వ్యాధుల మూలాలనెరిగి….
అమలు పరిచారేమో విజ్ఞులార్యులు 
ఆమోద మోదమున ....నాటి వ్యవస్థలు.  

వానరాల నాటి వాగు వంకలు....  
చెట్లు పుట్టలు కొండా కోనలు...... 
వాసాలన్నీ మార్చుకుని….వారెవ్వా యనగ

గుహలు డేరాలు గుడారాలు గుడిసెలు.... 
ఇగురమైన ఇళ్ళు వాకిళ్లుగ.....  
అందమైన లోగిళ్లుగా 
అలంకరించుకోలేదా .... 
రేపటి రూపం…రూపు మార్ప ..... కష్ట జీవులు 

చోరుని జూసిన శునకం భౌ భౌ మనంగ   
నమ్మకమున వెంట నడచు నడిరేయైనా... 
తక్కిన కుక్కలు బహుదూరమునుండైనా.... 
గ్రామసింహం పాటి జ్ఞానం గాదె 
మనుజుని నడవడి మహిలో ఎంచగ .... 




నగునూరి రాజన్న 
కరీంనగర్

No comments:

Post a Comment