సంగీత సౌరభాలు
తేది: 13-07-2021
శీర్షిక: అనంత విశ్వం….
కవిత సంఖ్య: 36
ఆస్వాదించే మనసుండాలి గాని
అణువణువు రాగం పొదిగిన భరిణె
అల్లన వీచే గాలి తరంగం ఓ రాగమే
అనంత విశ్వమే విశాల సంగీత సౌరభం…
పచ్చికలో పడి లేచే లేడికూన పరుగులు
పారేటి సెలయేటి నీటి సవ్వడులు
ఉదయాత్పూర్వపు పక్షుల కిలకిలా రవములు
చిటపట చినుకుల సయ్యాటలు
మనసును మురిపించే ఏ సవ్వడైనా……
తరువున వీచేటి పవన వీచికలు
అడివిన రాలేటి ఎండుటాకులు
వసంతంలో మ్రోగేటి కోయిల రాగాలు
ఎదను కదిలించే ఏ శబ్దమైనా…..
పంచభూతాలే వీనుల విందైన
సరిగమల రాగాలు మ్రోగించగా
పశుపక్ష్యాదులు శుకపికములు
పదనిసల రాగాలు ఆలపించగా…..
అమృతమయమైన అమ్మ లాలి పాట
ఆనందాలమూలమైన చెలియ మాట
బోసినవ్వుల చిన్నారి మారామం
చెవులకింపయ్యే చెప్పలేని భావనలు....
ప్రశాంత చిత్తం కురిపించే
పరిమళ నిర్మల స్వభావం
స్వరం నిండిన సర్వం
సాగర సంగీత సౌరభాలే…….
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment