అలుపు లేని వలపు రాగం
తేది: 13-07-2021
శీర్షిక : సంపూర్ణత్వం….
కవిత సంఖ్య: 707
సంప్రదాయాల సందుగలో నుండి
కుమ్మరించుకున్న జ్ఞాపకాల ఆనవాళ్లకు
అప్పుడే నాలుగు దశాబ్దాల కాలమంటే
నమ్మలేని నాజూకైన నిజమనిపిస్తోంది….
ముందే తెల్సిన సంబంధమైనా
నిటారైన జొన్నకంకిని జిరాఫీ తిన్నట్టు
స్వయంగా కాళ్ళపై నిలిచి తలెత్తుకున్నాకనే
మూడుముళ్ళ బంధమై బలపడింది…..
అంగరంగ వైభవంగ ఏర్పరుచుకున్న
పచ్చని పందిరిలో అమ్మానాన్నలు
బంధు మిత్రుల బలగంతో పొందిన
అప్రతిహతమైన ఆశీర్వచనాల బలమో ఏమో
సతత హరితపు తరువులా చివుళ్ళేసింది…..
వీనుల విందైన సన్నాయి వారి
బాజా భజంత్రీల నాద బలమో
వాక్శుద్ది కల వేద బ్రాహ్మణ పండితుల
వేదమంత్రాల సమరస సారమో పిల్ల
శాఖలతో విస్తరించింది ….
అప్పుడప్పుడు అలకల నలకలు చేరినా
అంతా హుష్ కాకి అయిపోతూనే
చిలకా గోరింకలై… కేరింతల పర్వములో
సయ్యాటల సందళ్ళు చేరి అలకలు తీర్చుతయి….
సద్యోగం విశ్రాంతమయ్యేసరికి
సరాగాల తోటలోకి వచ్చిన
వసంతాల కోకిల గానంలా
సదా చెంత చేరిన బంధమెంతో
సంపూర్ణత్వాన్ని సంతరించుకున్నది ….
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment