సమయస్ఫూర్తి
తేది : 13-07-2021కవిత సంఖ్య : 143
శీర్షిక : చతురత
నిత్య జీవన పయనంలో చిన్నా
పెద్ద సమస్యల సుడిగుండాలు
చుట్టుముడుతూ ...
అలవోకగా సాగాల్సిన జీవన నౌకా యానం
అల్లకల్లోల కుదుపులతో అతలా
కుతలం చేస్తూ అనుభవ పాఠాలను
మనకందిస్తుంది .....
అనుభవ పాఠాలను వల్లె వేసుకుని
సవాళ్ల పరిష్కారానికి అవరోధపు
బురదలను గుర్తించి సవ్యమైన
ఆయుధాలను సంధించుకుంటూ...
కంటకాల అడ్డంకులను అధిగమిస్తూ
జయాల జండాలను ఎత్తుకొని ముద్దాడాలని
ప్రతి పనికొక పంథాను పాటిస్తూ
మనిషి మనిషికో మడతను ఎరగా వేస్తూ
పరిస్థితుల స్థితి గతులననుసరించి....
ఆలోచనల అన్వేషణలలో ఎప్పటికప్పుడు
సరికొత్త ఎత్తులు రచిస్తూ.... మారుస్తూ ...
కొత్త కొత్త దారులను ఎన్నుకుంటూ ...
కోరి వెదుకుతూంటాము చతురతతో ......
అయినను అప్పుడప్పుడు
అపజయాలు పలకరించి
చుట్టాలలా తిష్ట వేసుకున్నా
వెరవక సమయస్ఫూర్తి ప్రదర్శించాలి ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment