Sunday, September 5, 2021

జీవన పయనం తేది : 02-07-2021

 జీవన పయనం

తేది : 02-07-2021
శీర్షిక :సాగిన పయనమంతా....
కవిత సంఖ్య : 140

ఆకులలములు కట్టుకు తిన్నా
రాతి పనిముట్లతో రాజ్యమేలినా 
లోహపు పనిముట్లతో  లొట్టలేసినా
మానవాళి జీవన పయనం సాగి పోయింది ...

నాగరికతల నీడల్లో నడిచినా
రవాణా సౌకర్యం పెంచుకున్నా 
సమయాలను కుదించుకున్నా
పరుగు మాత్రం ఆపలేదు .....

పారిశ్రామికతలతో  పాకులాడినా
అభివృద్ధిలో అందలమెక్కినా
ఆకాశయానం ప్రారంభించినా
మనిషి పయనం సాగుతూనే ఉంది...

సాంకేతికతల సొబగులద్దుకుని
విశ్వ విశేషాల సమాహారం
అరచేతిలో ఆటపట్టయిన వేళ 
మరమనిషి పయన సాగుతూనే ఉంది ....

ఏది ఏమైనా ...
భూమి గుండ్రమన్నంత ముచ్చటగా
కంటికి కనపడని క్రిమి నీడను
చూసి జడుసుకున్న విశ్వం
ఒక్కసారి .... ఒళ్ళు జళ్ళుమంది ....
మడి కట్టుకుని ఓ మూల కూర్చోబెట్టింది ....
సాగిన పయనమంతా సేద దీరమన్నది ...

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment