Thursday, September 29, 2022

నాలుగు మాటలు తేది: 12-04-2022 శీర్షిక : అల్లుకు పోవాలి

 నాలుగు మాటలు 

తేది: 12-04-2022
శీర్షిక : అల్లుకు పోవాలి 
కవిత సంఖ్య : 889

భీకరాల  గ్రీష్మంలో భీష్మించక 
గుండు మల్లెలై పరిమళించాలి....  
గాలివానలకు గల్లంతు చేయకుండా 
గిజిగాని నైపుణ్యాల గృహమై నిలపాలి .... 

తొలకరిలో నవ్యంకురాల వలె
ముసిముసి నవ్వుల మెరిసిపోతూ 
పుడమితల్లికి సమర్పించిన 
ముత్యాల హారములై ముద్దుగొలపాలి .... 

వర్షఋతువులో ఘర్షణ పొంది 
కట్టగట్టుకుని కొట్టుకుపోకుండా…
కొత్త నీటి ప్రవాహాలలో….కొట్టుకపోయిన
కల్మషాల.. తదుపరి ...సెలయేటి 
తీరాలలో ... కడిగిన ముత్యపు  
ఆల్చిప్పల్లా... వన్నెలీనాలి 

గమ్మత్తయిన గరికవనంలో 
కోరి శరదృతువుల కాలంలో
కొలువైవున్న తుషార బిందువుల్లా 
హుషారు గొలిపే ఉఛ్వాస అవ్వాలి .... 

శిశిరంలో తలలూపుకున్న 
తరువులకు వసంతాల గంధమద్ది 
చిగురించే పూరెమ్మల చిగుర్లు తిన్న 
మత్త కోకిలల గానమవ్వాలి ..... 

ఎదురుగ మెర మెప్పుల మెచ్చుకోళ్ళు 
వెనక గుంభనంగా గుసగుసలకన్నా .... 
చాటైతే చాడీల చాటింపులకన్నా .... 
మనిషి భౌతికంగా లేకపోయినా 
మననంతోనే మది మెరిసిపోవాలి .

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment