అంతర్వేదన
తేది :07-04-2022
శీర్షిక : కాల్చిన సువర్ణం
కవిత సంఖ్య : 886
అడివిని నిండారా ఆరబోసినా
ఆడవారి అందాలను వర్ణించినా
బాల్యాన్ని బహుమానంగా ఇచ్చినా
వృద్ధాప్యాన్ని విశేషంగా వడగట్టినా ....
అంతరంగంలోన అలలను
విస్తరింపజేసి .... పేరబెట్టి
అపురూపకంగా ఆరబెట్టి
సున్నితంగా సృషించాలి .....
సుతారంగా కలం లోంచి
సుకుమారంగా వంపాలి
కాగితాలమీద హృద్యంగా కదిలించి
హృదయాలను ద్రవింప చేయాలి ....
దొంగను దొంగా అనకుండా
తోటోళ్లను మేల్కొల్పాలి ...
రంకు నేర్చిన రాజకీయాన్ని
కూడా రంగులేసి ప్రదర్శించాలి ....
కలలలో ... కలవరింతలలో
కాచి వడబోయాలి ప్రతీది ....
నిద్రలేని రాత్రులను కూడా
నీరుగార్చకుండా నిగారింప
చేయాలి ....
కళ్ళకు కనపడకుండానే
కవాతు చేయాలి అనుక్షణం ....
కాల్చిన సువర్ణంగా తళతళ లాడించి
మెరిపించి ... మరిపించి
అందరిని మురిపించాలి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment