Thursday, September 29, 2022

ధరల జాడ చెప్పరూ ... తేది : 05-05-2022శీర్షిక : యథా రాజా తథా ప్రజ 

 

ధరల జాడ చెప్పరూ ... 2
తేది : 05-05-2022
శీర్షిక : యథా రాజా తథా ప్రజ


సంప్రదాయపు సంతలలో 

సరుకుల ధరలతోపాటు 
సహృదయ ప్రేమలు ఆప్యాయతల 
సమతుల్యతల సరాగాలుండేవి ... 

పారిశ్రామికీకరణ పరుగులతో 
పక్కోడి బాధ గోడు పట్టించుకున్న 
దాఖలాలు కనుమరుగయ్యాయి .... 
చేతులు మారి గోతులు తవ్వే పరిస్థితి ... 

రవాణాల సౌకర్యాలతో .... కాశ్మీరు 
వస్తువులు కన్యాకుమారిలో ప్రత్యక్షమై 
హిమాలయాల చల్లని  ఉనికిని కోల్పోయి 
భూమధ్య రేఖ  భగభగలు ప్రదర్శిస్తున్నాయి ... 

అమ్ముకునేవాడేమో అడ్డికి పావుసేరు ... 
కొనేవాడికి మాత్రం కొండమీది కోతి ... 
మధ్య దళారులదే మంచి హవా .... 
గాలికి తూర్పార పట్టుకుని నింపుకునుడే .... 

కార్పొరేట్ కల్చర్లో .... ఆన్లైన్ కొనుగోల్లో ... 
ముఖ పరిచయాల ఊసులు ఆసల్లేవు .... 
స్వార్థాల సంచులు నింపుకుని ... విలువల 
వలువలు విప్పేసి ...కట్టలు కూడా బెట్టుకోవడమే ... 

తాడెక్కేవాడి తలదన్నేవాడులా .... 
కార్పొరేట్ల ఫండింగులతో ... పగ్గాలు చేపట్టి 
అందలాలు వెలగబెట్టే .... నీతి జాతి 
లేని పాలకులు  ... ధరల నియంత్రణలకు 
తిలోదకాలిచ్చి ... ప్రేక్షక పాత్రల పెద్దన్నలైపోయి ... 
ప్రజల నడ్డి విరగ్గొడుతూ పరాచికాలాడుతున్నారు  .... 

ఉత్పత్తి ... ధరల స్థిరీకరణలు  ....నియంత్రణలు ... 
రైతులు ... దళారులు ... పారిశ్రామికవేత్తలు ... 
పాలకులు ... అధికారులు .... అంతా ఒక 
విషవలయం .... వినియోగదారుని మెడకు 
ఉచ్చు తగిలించే ఉరితాడులోని పాయలు ..... 

యథా రాజా తథా ప్రజలా ... 
నీతి తప్పిన పాలనలలో ... 
నేతి ఘుమ ఘుమల వాసనలా .... 
స్వార్థాలు సమసిపోతేనే .... 
సమన్యాయం అందుబాటు ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment