చిత్ర కవిత
తేది: 08-04-22
శీర్షిక : దేశ వెన్నెముకలు
కవిత సంఖ్య : 123+4
రైతన్న ....
రాజంటున్న రైతు బంటయితేనే
రత్నంలా గిర గిర తిరిగి
తాను మట్టి పిసుక్కుంటేనే ...
మనకు బువ్వ దొరికేది ...
అప్పులిచ్చు సాములు మొదలు
అరువుల ఎరువులు,నకిలీ విత్తనాలు
నలిపి ... రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ ...
అవినీతి అధికారుల అమ్యామ్యాలతో
(భూసార పరీక్ష, నీటి పారుదల , విద్యుత్,
వ్యవసాయ మార్కెట్
ఆఖరకు వ్యాపార బాంకులు సైతం….)
మెచ్చని పోశమ్మలే అందరూ
పట్టనే పట్టదెవరికి గిట్టుబాటు
మందులు నకిలీవైనా
ఆత్మహత్యలకు నిఖార్సే ....
ఆకలి దప్పులకు అలమటిస్తూ
అప్పుల కుప్పైనా ఆశలు చావక
అన్నపూర్ణగా నిలుస్తాడు ఆదరువై
ప్రజలంటే ప్రాణమిడుస్తాడు ....
ఇక సిపాయి ....
కన్న తల్లితండ్రులకు
కట్టుకున్న ఇల్లాలుకు
కనిపెంచే పిల్లలకు
కనిపించనంత దూరం ....
ఎండా వాన చలి మంచులైనా
ఎంచక్కా నిలువు బండే
హిమాలయాల అంచుల్లో
ఇసుక ఎడారుల వీధుల్లో ....
కొండా కోనలే కోణంగి నేస్తాలు
వాగు వంకలే వసతి సౌకర్యాలు
చిన్న చిన్న డేరాలు మిణుకు
మిణుకు ఆశల సౌధాలు ....
ప్రజల సౌకర్యమే పండుగలు
పగలు రాత్రుల తేడాలేని పహారాలు
దేశ శ్రేయస్సే ఉచ్వాస నిశ్వాసలు
కోట్లాది ప్రజలకు నిర్భయం
కోరుకున్న ప్రశాంత జీవనం ....
అందుకే అంటున్నా ఇద్దరు
నడ్డి విరుచుకుని నాట్యమాడినా
దేశానికి వెన్నెముకలు
దోస్తానానికి చిరునామాలు ...
ప్రజలు ప్రభుత్వాలు
స్వచ్చంద సంస్థలు
పారా హుషారు మిత్రమా
గుర్తించక తప్పులు చేయొద్దు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment