అంశం - మట్టి పాదాలు
తేదీ - 16-08-2019
శీర్షిక - మట్టికి చుట్టాలే మన రైతన్నలు....
సంఖ్య - 263
వరుణుడు వాతలెన్నిపెట్టినా
వ్యాపారులు నీతి ఎంత తప్పినా
దళారులదంతా దమన నీతైనా
పాలకుల మాటలు పాటికాపోయినా
అధికారులు అమ్యామ్యాల మూటలడిగినా
మట్టికి చుట్టాలే మన రైతన్నలు....
కరెంటు కటకటలు కష్టాలు పెట్టినా
సాగునీరు సమయానికి సదురుకోకపోయినా
శిస్తుల వసూళ్లు శిలువ వేసినా
విత్తనాలు నెత్తిన మొట్టికాయలేసినా
ఎరువులన్నీ కలిసి పరువు తీసినా
మట్టికి చుట్టాలే మన రైతన్నలు .....
కంటి కోలుకుల కన్నీరు మింగయినా
పంటి బిగువున బాధలు అదిమిపట్టయినా
మడమ తిప్పని మరో ప్రయత్నమంటడు
పాడి పంటలే పంచ ప్రాణమంటడు
కోట్ల ప్రజల ఆకలితీర్చ పాట్లు పడుతడు
మట్టికి చుట్టాలే మన రైతన్నలు ....
రైతే రాజనే నానుడే ఉన్నా లేకున్నా
జైకిసాన్ అని నినదించకపోయినా
కడుపు కట్టుకుని పస్తులుండైనా
పుస్తెలమ్మినా పూట గడవకపోయినా
అన్నదాతలు దేశ హాలికులు
మట్టికి చుట్టాలే మన రైతన్నలు ....
పెత్తందార్ల స్వార్థ లాభాపేక్షలకు
పుచ్చిన విత్తనాలైనా కుళ్ళిన ఎరువులైనా
అంకురమై మొలకెత్తు రైతన్నస్వేదంతో
అరవిరిసిన పువ్వై విచ్చుకును అతని రక్తముతో...
కసాయి గుండెల కడుపులు నింప ....
మట్టికి చుట్టాలే మన రైతన్నలు ....
మానవత్వానికే మచ్చు తునకలు మన రైతన్నలు
No comments:
Post a Comment