ఎడబాటు
తేది- 26 -03 -2020
శీర్షిక- మరువలేని మననం ....
సంఖ్య- 377
మమతానురాగాల కొలతల గీటురాయని
మౌన మానసిక సంగమాల సంతులితమని
గుణగణాల వివేచనాల విశ్లేషితల రాజహంసని
స్వభావ సందర్భాల వడబోతల వస్త్రగాయితమని....
గుర్తుకొస్తున్నాయి పదే పదే .....మరువలేని మననం
అనుక్షణం తన్మయత్వం చెందిన
అమ్మ అనురాగాల అనునయాల స్పర్శ...
ప్రతిక్షణం పరిణతి పొందగలిగిన
నాన్న పెంపకంలోని మందలింపు....
కనివిని ఎరుగని కలుషితాల
కంగుతింటూ కడతేర్చుకుంటున్న సమయాన...
కరోనా కబంధ హస్తాలలో బంధింపబడి
క్షణం క్షణం పరితపిస్తున్న వేళ .....
పాలకులు పత్రికలు ప్రముఖులు
పనిగట్టుకుని జాగ్రత్తలు తెలుపుతుంటే....
నాటి మీ సూచన పరంపరలే గుర్తుకొస్తున్నాయి
మరువలేక మననం చేసుకుంటున్నా.....మీ ఎడబాటును
కర్కశమైన నాటి అరాచక అంటువ్యాధులను
కఠోర దీక్షలతో అధిగమించిన మీ ఆత్మస్థైర్యం...
గుంభనంగా గువ్వలై సంసారాలను ఈదిన సందర్భాలు
చేతిలో పది లేకపోయినా...చతికలబడని చక్రాలైన వైనం ...
కలిగిన దాంట్లో కలో గంజో...
ప్రాణం నిలుప పచ్చడి మెతుకులో... అన్న మీ
ఆర్ద్రత మాటల ఆనుపానులు ఆకళింపు చేసుకోలేకపోయాము.....
మరువలేక మననం చేసుకుంటున్నా.....మీ ఎడబాటును. ...
నగునూరి రాజన్న
హైదరాబాద్
No comments:
Post a Comment