Wednesday, April 1, 2020

మనోధైర్యం

మనోధైర్యం
30-03-2020
శీర్షిక - నడిపించేది..... 
సంఖ్య - 380

పుట్టి పెరిగిన పరిస్థితులు...
చుట్టూ జరిగే ఘటనలు...
మనసు తెరపై వదిలే గుర్తులకు
ప్రత్యుత్తరమై పడిలేచే కెరటం.... మనోధైర్యం 

అనావృష్టి కరువు కాటకాల కల్లోలాలల్లో 
అతివృష్టి తుఫాను భీభత్సాలల్లో 
ఆరుగాలపు శ్రమ శ్రీమంతం ఆవిరైనా.... 
అడుగడుగున ప్రోది చేసుకునే హాలికుడు.... 

కార్గిల్ సియాచిన్ శిఖర తలాలలో 
కన్నుకుట్టే కపట పొరుగు చేష్టలతో 
ఎముకలు కొరికే చలి దుప్పటిలో 
కునుకు మరిచి నిలిచిన సైనికులకు
మాతృ దేశంపై ఉన్న మమకారమే .... 

రాకాసి చీకట్లు రాశి పోసుకున్న వ్యవస్థలో 
రెక్కల కష్టాలకు తప్పుడు లెక్కలోలె 
ఎన్ని చేసినా లెక్క నిండని ఏమార్చే లోకంలో 
బతకాలంటే కావాల్సింది..... 

పుట్టి బుద్దెరిగిన నాటి నుండి 
ప్రచురణలో జరిగే అచ్చు తప్పులోలె 
పేరు మార్చుకుంటున్న పెద్దరికాలతో 
రంగు మార్చుకుంటున్న రాజరికాలతో
సాలె గూడు బందీ క్రిమిలా బతకడానికి
 బలమంతా కూడదీసుకుంటున్నాడు...సామాన్యుడు. 

మొక్కవోని మనోధైర్యాలే దిక్సూచి దివిటీలై
ముందుండి నడిపించేది. 

నగునూరి రాజన్న 


హైద్రాబాదు. 

No comments:

Post a Comment