Tuesday, September 25, 2018

అమెరికా ...జీవితం

అమెరికా ...జీవితం

అమెరికా జీవితమంటే అనాయాసమేమి కాదు.
అందమైన పూల పానుపనుకుంటాం.... 
అద్దాల మేడలనుకుంటాం.......
అంతా పచ్చ తివాచీలమయమనుకుంటాం ..... కానీ
మంచి చెడుల మేళవింపే మిత్రమా !

వాయు ప్రయాణ ప్రాంగణాలు  మొదలుకుని
వాణిజ్య కూడళ్ల  సంతల ముందు సైతం
వాహనముల పార్కింగులకు వాకిళ్ళ విశాలత్వం 
పెను దారులకిరు వైపుల కాలి నడక దారుల మాలలు

ఇంధనాలు నింపుకోవడం దగ్గరనుండి
ఇబ్బడి ముబ్బడి రహదారుల కూడళ్లలో
ఇరువైపుల రోడ్ల పైన ఎవరికి వారు పాటించే
ఇంపు గొలుపు స్వీయ క్రమ శిక్షణలు. 

రాజకీయులు , అధికారుల  మాటలెలా  ఉన్నా
ప్రతి పనిలో గోచరించు పద్ధతైన పనితీరు
మనిషి ప్రమేయం తగ్గించి, మర విధానం పెంచడం వల్ల
అవినీతి, లంచగొండితనం  ఆనవాళ్లు కానరావు

ఎచ్చొట  చూసినా దుమ్ము ధూళి ముచ్చటే లేదు
పచ్చటి  గడ్డి తివాచీతో పరవశించవచ్చు.... కానీ
వీధి దీపాల ఛాయలు మాత్రముండవు....
వింత గొలిపే వాతావరణాలుంటాయి.......

ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అంతస్తులైనా
కర్రలతో ఇళ్లు  కడతారు కడు రమ్యంగా ఉంటాయి.... అయినా
కొర కొర ఎండలతో కొలిమి మంటలు
కర కర చలితో ఎముకల నొప్పులు...
విటమిన్  'డి' కై వెంపర్లాట.


అలవోకగా బతికిన మన బతుకులకు 
ఆంక్షల మయమే అనిపిస్తుంది అంతా ....
కాలి నడకలతో కదలలేము ఏ చోటికి
చతుశ్చక్ర వాహనంతోనే చలనమెచటికైనా.. 

భార్య భర్తలిద్దరూ పరుగు పరుగు కార్యాలయాలకు
నెలల పిల్లలనుండే  "డే" కేర్ల అప్పగింతలు
వారంలో ఐదు రోజులు పని రాక్షసులై 
బతుకుదెరువు కొనుగోళ్ళకు రెండు రోజులు సుతారంగా..... .

పెన్ను కల్చర్ మనదైతే ...
గన్ను కల్చరంతా అమెరికాలో సుమా ...
ఏ రోజు ఏ బడిలో ఏమవుతుందో ....
ఏ రోజు ఏ కార్యాలయం దగ్గర ఏమవుతుందో ....

అల్లాడే పసి పిల్లల ఆటా పాటలకై 
ఆదరించాల్సిందే దగ్గర్లోని పార్కులను.
అమ్మా నాన్నలైనా,అత్తామామలెవరైనా సరే... 
మంచి చెడుల బాగోగులు దూరవాణిలోనే.

సంధి కాలంలో సంచరిస్తున్నాము.
గుండెల నిండా గుబులు నింపుకుని...
మనము రెండు తరాలు మారితే
ఇంక ఎవరికీ వారే యమునా తీరే.... 

No comments:

Post a Comment