Thursday, September 20, 2018

చెరువు


తేది  :07-09-2018
శీర్షిక : ఊరుమ్మడి బతుకు

స్వాగతాల తోరణమే మా ఊరి చెరువు .
జోరు వానలందుకుంటే పడువాటుకు నిండు. 
మత్తడి దునికిందంటే చిన్నపాటి జలపాతమే.
చెరువు నిండిందంటే ఊరు ఊరంతా పండగే.
చేతి వృత్తుల వారందరికి చెల్లి పోవు కష్టాలు.

పిల్లా పాపలందరికి  సంబరాల అంబరం. 
ఈతలకు ఊతమిచ్చే ఆటలకు నెలవు.
భూగర్భ జలం పెరిగి బావులకు బలం.
ఊరందరి బట్టలకు ఉతుకు రేవు నిజం.
నీరటి తాతకు  పనే తూము నిగురాని కోసం.

ఒడి నిండిన అమ్మలా అందమైన చేపలకు
అలవికాని బెకబెకల గోండ్రు కప్ప కుప్పలకు
జర జర పాకి జడుపు పెట్టె వాన పాములకు
అప్పుడప్పుడు కనిపించే తాబేలు భామలకు
ఆలవాలమౌతుంది జలచరాలకు జీవనాధారం.

అలల సవ్వడులతో  ఆనందాలను పంచు. 
నడి మధ్యన తుమ్మలపై  కొంగల గుంపులు
తెల్ల పూల పెద్ద బతుకమ్మను తలపించు. 
పశు పక్ష్యాదుల కిల కిలా రవములతో రంజిల్లు. 
పచ్చ తివాచీ పరిచినట్టు పల్లె పరవశించు.

చెరువు లేని ఊరు ఉందంటే అచ్చెరువే!
గొలుసుకట్టు చెరువులు వరదపోటు నివారించు.
ఒక ఊరి పడువాటు పక్కూరు చెరువు నిండు .
రైతుకు సాగు నీటి కష్టాలు సాదరంగ తీరు.
మానవ మేధస్సుకు మణిహారపు మచ్చుతునకలు.

చవితి పండుగ గణపతి పత్రులతో
రంగు రంగుల పూల బతుకమ్మలతో
రమ్యమైన తంగేల్లు, గుణుక పూలతో
రంజిల్లు ఔషద గుణాలు పుణికిపుచ్చుకుని.
తాగు నీరై వర్దిల్లు జనం తనివి దీర.

ఎండాకాలమొచ్చిందంటే నెర్రెలతో విర్రవీగు.
కోపుల్ల మట్టి తీసి కర కట్టలు సరి జేత్తురు.
పనికి ఆహారమై కూలినాలి బతికేరు. 
ఒండ్రు మట్టి తరలింతురు వరి చేలకు చేవకై. 
ఎండిన తుమ్మకాయ  గొఱ్ఱెమేకకు ఆహారం.

అన్ని కాలాలలో పనులు కల్పంచి ఆదరించు.
ఒక్క చెరువుంటే చాలు కుల మతాలకతీతంగా ఊరంత బతుకు.

No comments:

Post a Comment