నగునూరి రాజన్న
అంశం : ఆకాశం
తేదీ : 28-08-2018
సంఖ్య : 42
శీర్షిక: అమృతమూర్తి
బోసినవ్వుల పాపాయిల మారములకు
చందమామను చూపిస్తూ గోరు ముద్దలందించే
అమృతమూర్తి అమ్మ చేతి మంత్రదండానివి.
పచ్చని పంటపొలాలకై నిలిచే నెచ్చెలి నీవు
హలం పట్టి పొలం దున్ని అన్నపూర్ణను
అందించే రైతన్నకు ఆపన్న హస్తనివి.
అనేక గ్రహ కూటముల, నక్షత్రాల కదలికలతో
అనాదిగా మానవజాతికి మీన మేషాలు లెక్కించే
సవాలక్ష సంకేతాలకు ఆధార భూతం వేదపండితులకు.
అనంత కోటి జీవరాశుల్లో ప్రశస్తమైన పక్షులకు
ఆలంభనమై, మానవ మేధస్సులో సైతం దూరి
వాయు ప్రయాణానికి నాంది పలికించిన పంచ భూతానివి.
అప్పుడప్పుడు చిత్రకారుని అందమైన కుంచెగా మారి
ఆనందాలకు నిలయమైన ప్రేమికుల మనసు లాగ
రంగు రంగుల వర్ణ చిత్రాలతో రమ్యత చేకూరుస్తావు.
అంతు లేని ఆశల, ఆశయాల సాధనాలకు
అనంతమైన విశ్వ రహస్యాల గుట్టు విప్పడానికి
ఆలవాలమై ఆలంబనగా నిలుస్తావు శాస్త్రవేత్తలకు.
అన్నింటా నీవై, నీవే అన్నింటా నిండి అనంతమై
మానవాళి చర్యకు ప్రతిచర్యగా కాలాలను కదిలించే
పంచభూతాలను ఇముడ్చుకున్న అమృతమూర్తివి.
No comments:
Post a Comment