Thursday, August 2, 2018

మహిళా ఉద్యోగులు


మానవ జన్మే అమ్మ పెట్టిన బిక్ష 
కార్యేషు దాసి , కరణేషు మంత్రి 
భోజ్యేషు మాత, శయనేషు రంభ అని 
నాడే అన్నింటా తానై నిలిచింది  తాను గెలిచింది .

మహిళ ప్రకృతి ధర్మమో  మను సిద్ధాంతమో 
మగవాడి అవసరమో....  అనేక పరిమితులతో 
ఇంటికే పరిమితమయ్యింది. కానీ 
కూలికెళ్లినా ఆలికి తప్పవు అష్టకష్టాలు 
ఆయమ్మ నుండి అధ్యక్షురాలి వరకు 
కండక్టరు నుండి కొండలెక్కేవరకు 
ఆటో నుండి అంతరిక్షం వరకు  
చేయలేని ఉద్యోగమంటూ లేదు

ఏ ఉద్యోగమున్నా లేకున్నా 
కోడి కూతకంటే,ఇంటిళ్లిపాదికంటే ముందే లేసి 
పిల్లలకు, భర్తకు, అత్తామామలకు అన్నీ అమర్చి 
బండెడు భారాన్ని సైతం ఒంటి చేత్తో చేయగలదు. 

బ్రతుకు దెరువు కొరకై బస్సెక్కి బయలుదేరి 
ప్రయాణ కష్టాలను చూసి చూడనట్టుగా దాటేసి 
కష్టాల ఛాయలను కళ్ళలో కనబడనీయక 
ఎలాంటి మినహాయింపులు లేకుండా 
అందరితో సమంగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

పంతులమ్మలుగా భావి పౌరులను తీర్చి దిద్దినా
పాలనాధికారిగా పలు సంస్కరణలు చేయగలరు.    
ఆయమ్మలుగా అన్ని సపర్యలు అందించినా  
అధికారులుగా సైతం పెత్తనం చలాయించగలరు. 
అది ఇది అనే పరిమితులు అక్కరలేదు 
అన్ని రంగాలలో అమితంగా రాణిస్తున్నారు 
అయినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇంకా 
అవకతవకల కుదుపులకు లోనవుతూనే ఉన్నారు. 

సాటి ఆడవాళ్లు, సగటు మగవాళ్ళు 
సరైన ప్రోత్సాహం రెట్టింపు చేస్తే 
అపర ఝాన్సీలుగా, రుద్రమలుగా 
తీర్చి దిద్దగలరు ఇంటినీ సంఘాన్నీ దేశాన్ని. 

No comments:

Post a Comment