నగునూరి రాజన్న
అంశం : బోనాల జాతర
శీర్షిక: తెలంగాణ పండగ
తేదీ . 06-08-2018
అరుదెంచె తెలంగాణ అమ్మవారి జాతర
ఆషాడంలో అరుదెంచె జగజ్జనని జాతర
కలరా మశూచిలను కడతేర్చి కాపాడమని
కోటొక్క మొక్కులతో కొలిచేరు జనమంతా
పసుపు కుంకుమ వేపరెమ్మల అలంకరణలు గావించి
పడతులంతా బోనమెత్తి పూనకాల ఊగిపోతూ
పైన దీపం వెలిగించి ప్రాణప్రదముగ అడుగులేస్తూ,
పసుపు పారాణి రాసుకుని ,పట్టు చీరెలు కట్టుకుని
మహంకాళి రౌద్రాన్ని కళ్ళలో నిలుపుకుని
అమ్మవారి అంశగా ఆనందాల పరవశాన
తరలి వత్తురు జనం తలపైన బోనంతో
పోతరాజుల గంతులేయ డప్పుదరువుల వెన్నంటి
అమ్మింటికి అరుదెంచిన ఆడపడుచుగా
అక్కున చేర్చుకుని ఆదరించి బ్రోవుమని
ఆదిశక్తిని వేడుకుని ఆషాడపు ఆదివారాలలో
అర్పించి మొక్కేదే బోనాల జన జాతర
గోల్కొండ బల్కంపేట ఎల్లమ్మ తల్లులు
ఉజ్జయిని మహంకాళి, చిలకలగూడ మైసమ్మలు
హరి బౌలి అక్కన్న మాదన్నల మహంకాళి,
లాల్ దర్వాజ మాతేశ్వరి,శాలిబండ ముత్యాలమ్మలకు
అమ్మలగన్న అమ్మలే ఆషాడ దేవతలు
మడి ఆచారాలతో శుచి శుభ్రతలతో జనం
అకుంఠిత దీక్షలతో అర్పించి మొక్కేది
ఆచరించి సమర్పించేదే అమ్మవారి బోనం.
తొట్టెలు, ఘటాలు, రంగం, బోనం, గావు
అమ్మకు అర్పించే ఆదరణ మొక్కులు
శతాబ్దాల చరిత కలిగిన తెలంగాణ పండగ
జరుపుకొనిరి జనులంత మనసంతా నిండగ.
No comments:
Post a Comment