Friday, July 14, 2017

మాతృ భాష మకరందము

మాతృ భాష అనగానే -మనసు పులకరిస్తుంది 
మమత వెళ్లి విరుస్తుంది -మమేకం అవుదాం అనిపిస్తుంది 

అచ్చులు పదహారు- హల్లులు ముప్పదెనిమిది 
ఉభయాక్షరములు  మూడింటితో-వర్ధిల్లుచున్నది తెలుగు వర్ణమాల 

రాయల కాలములోనే - రాచ మర్యాదలు అందుకున్నది 
అష్ట దిగ్గజములతో అలరించి -అపర ఖ్యాతిని పొందినది 

ఎందరెందరో మహానుభావులకు - ఏలికగా నిలిచి ఖ్యాతి తెచ్చినది 
నాటి నుండి నేటి వరకు వారధిలా నిలిచినది-తెలుగు వారికి గౌరవాన్ని కూర్చినది 

నన్నయ్య, తిక్కన, ఎర్రన, పెద్దన - శ్రీనాథుడు,మొల్ల,తిమ్మన 
అన్నమయ్య, త్యాగయ్య,  రామదాసు ,గురుజాడ ,
విశ్వనాథుడు, జాషువా, శ్రీ శ్రీసి నా రే ఆదిగా గల అందరూ 
తల్లి సేవలో తరించిన కన్న బిడ్డలే

పాలు మీగడలకన్నా, తేనె ధారలకన్నా -మధురమైనది మన మాతృ భాష 
పరికించు మిత్రమా బహు లెస్సగా - అమ్మ  లాలి పాటలే అందుకు సాక్ష్యం 

పరాయి భాషలకు కిరాయి మనుషులుగా - సంకర భాషలకు దాసోహం అనకుండా 
మాతృ భాషా మహాత్యాన్ని గుర్తించుదాం - మనవంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం 

బ్రౌన్ లాంటి పరదేశీయుడే - బహులెస్సగ  ప్రాకులాడి 
భాషాభివృద్దికి నిలిచాడు - బహుళ ప్రాచుర్యం పొందినాడు 

భాషా భాగములు, వ్యాకరణ ఛందస్సులు-సంస్కృత సంధులు , సంక్లిష్ట సమాసములు కాదు 
సరళమైన భాష పైన స్వచ్చమైన అభిమానం చాలు-పది కాలములు పదిలముగా నిలుపుటకు  
ముత్యమంటి అక్షరముల     - మాతృ భాష మకరందము 
ముద్దులొలుకు పదకూర్పుల - మమకారముతో నింపుదాం 

ఆత్మీయత జోడిస్తూ           - ఆదరిస్తూ ఎల్లప్పుడు 

ముందు తరాలకు అందిద్దాం - ముచ్చటైన మార్గ దర్శకముగా... 

No comments:

Post a Comment