Friday, July 14, 2017

తప్పు కొమ్ము కాసిన వైనం - ముంత కళ్ళు ముచ్చట (1965-66)

కల్లా కపటం తెలియని మా పల్లె జనమంతా

అరమరికలు లేకుండా  అన్నదమ్ములోలె కలిసుండేది

ముంతెడు కల్లు ముచ్చట ముద్దు ముద్దుగా మొదలైంది

ఊరు ఊరందరిని ఉరికించింది ముప్పు తిప్పలే పెట్టింది

తాటి చెట్టుకింద తాగిన తమ్మునికి

కల్లు పోసిన గౌడన్నకు మధ్యన

మాట మాట పెరిగింది మడత పేచీ అయ్యింది

పట్టింపులకు, పంతాలకు దారి తీసింది

తిరగబడి తిట్టుకున్నారు, కలియబడి కొట్టుకున్నారు

కసి పెరిగి బుసలు కొట్టింది, రచ్చ రచ్చగా మారింది

పగలు రేపి ప్రతీకారానికి నాంది పలికింది

పచ్చ గడ్డి వేస్తె భగ్గుమన్నది


రౌడీయిజం పెచ్చరిల్లింది, రాజకీయం రగులుకుంది,

పాత పగలు రేపింది, పల్లె రెండుగా చీలి పోయింది,

ప్రతీకారానికి  సై అన్నది,పండంటి జీవితాలను ఫణంగా పెట్టింది,

మతం రంగు పులుముకుంది, మానవత్వం మసక బారింది.

రజాకార్ల రోజుల్లో రక్షించిన జాగీర్దార్లు

తప్పు కొమ్ము కాసినందున  తల దించుకోవాల్సి వచ్చింది

అనేక వత్సరాలు ప్రజా రంజకంగా పాలించినా

ఫలితం లేకుండా పోయింది ఆనాటికి


అస్సోయి దూలా అంటే, ఎంకమ్మ సోలా అన్నట్టు

శివాలెత్తిన జనం చిందులేసి గంతులేసినారు

మత్తు నీడన మంచి చెడులు మరిచినందుకు ,

మసక చీకట్లో తరలి వెల్లాల్సి  వచ్చింది

వందలేండ్ల జాగీర్దారులు వదిలి వెళ్లారు మా పల్లెను

అప్పుడుగాని శాంతించలేదు  ఆగమయిన జన సందోహం 



కోతినుండి పుట్టాడు మానవుడన్న

డార్విన్ సిద్ధాంతాన్ని మరోసారి బలపరిచినట్టయింది

No comments:

Post a Comment