Friday, July 14, 2017

మా తల్లి గోదావరి



పశ్చిమ కనుమలలో పురుడు పోసుకుని 

దక్షిణ గంగగా ప్రాచుర్యం పొందినది 

త్రయంబకమ్  బ్రహ్మగిరి  జన్మ స్థానం -

మా తల్లి గోదావరి బహు పుణ్య నదము 



నాసిక్ , పైథాన్, నాందేడ్ ల మీదుగా 

మరాఠ నుండి పయనిస్తూ పరుగెడ్తూ 

పెన్ గంగ, వైన్ గంగలను కలుపుకుని 

మలి విడతన అడుగిడుతున్నది  తెలంగాణలో



మంజీరా,మానేరు ,పెద్దవాగులను 

కలుపుకుని పదిలంగా  ప్రవహిస్తూ

మాగాణులు పండించే రైతన్నలకు 

సిరి సంపదలందించె  తెలంగాణ వాసులకు 



బాసరలో చదువుల తల్లి శారదాంబ పాదాలనంటి 

దక్షిణ దిశగా పయనించి దండిగా భాసిల్లిన 

ధర్మపురి క్షేత్ర నృసింహుడిని పలుకరిస్తూ 

గూడెం సత్యనారాయణ స్వామిని సృశిస్తూ 



నాటి శాతవాహనుల కోటి లింగాల ఈశ్వరుణ్ణి ప్రస్తావిస్తూ 

సుందిళ్లలో వార నారసింహున్ని,

మంథనిలో గౌతమేశ్వరున్ని కలుపుకుని

ఆది బిక్షువు ముక్తేశ్వరుడిని కాళేశ్వరాన నిలుపుకుని

అపర త్రివేణిగా అవతరించినది ప్రాణ హిత సంగమంతో



భద్రగిరినందు  సీతా లక్ష్మణ హనుమత్ సమేత 

కళ్యాణ రామున్ని కమనీయంగా నిలుపుకుని 

ప్రకృతికే వన్నెలద్దుతూ పాపిడి కొండల్లో పయనిస్తూ 

పలు కమనీయ దృశ్యాలను  ఆవిష్కరించినది  



అద్వితీయముగా అడుగిడుచున్నది  ఆంధ్రప్రదేశ్ నందు  

పట్టిసీమ మొదలు కోనసీమ దాటుకుని అంతర్వేది వరకు 

పలు ప్రసిద్దమైన  ఆలయాలకు ఆలవాలమై నిలిచిది 

అచ్చంగా మూడు పాయలై  అందమైన డెల్టాగా అమరినది 



చిరు  చీకటిలో కాంతి రేఖ వలె పెద్ద దిక్కుగా 

చిన్న పెద్ద  925  డాములతో త్రాగునీరు, సాగునీరిస్తూ

6 రాష్ట్రాల అన్నదాతలకు ఆదరువై నిలిచినది

కన్న తల్లి వలె జీవనదియై ఆదరిస్తున్నది

No comments:

Post a Comment