గెలుపు గమనం
తేది :17-05-2022
శీర్షిక : సమన్వయాల సంతులనం
కవిత సంఖ్య : 903
సమస్యల సంచులు కుమ్మరించి
పరిష్కారాల తాళం చెవి వెదికి
సత్య శోధనలో నిత్యం మునిగాక
నిరుత్సాహల నీలి నీడలను తరమవచ్చు ....
మేధో మదనాల రాశులు పోసి
ప్రాధాన్యతలకు పట్టం కట్టి
ఎంపికల జాడలు తెలుసుకుని
ప్రణాళికల పర్వం రచించడం
ఒక ఎత్తయితే ....
గెలుపుల గమ్యపు శిఖరం చేరాలంటే ...
ఇష్టంతో పూనుకుని కష్టాలన్నీ
అధిగమిస్తూ ... వినమ్రంగా కృషితో
అడుగుల కదిలిస్తే ....గెలుపు గమనమే ....
కంచె గడ్డిలో కాలి నడక బాటలా
నడుస్తూ పోతూంటే... దానికదే
దారి పడినట్టుగా...పట్టుదలలే
పెట్టుబడిగా సాగిపోతే చిక్కదా ...
గానుగలో గరిటెడు నూనె
దక్కాలంటే ......శ్రమ విజ్ఞానాల
జోడు గుర్రాలను సమన్వయాల సంతులన
పరిస్తే ... చిక్కదా చక్కని ఫలితం ....
నిండుగ పండిన చెట్టులా ...
ఎత్తుకు ఎదిగినకొలదీ... ఒదిగి
ఒదిగి...వినమ్రతలను చిరునామాగా
చేసుకుంటే...వింతగా గెలుపు మన చెంతనే.....
అప్పుడప్పుడు పలకరించే వైఫల్యాల
రుచులను కూడా .... వైవిధ్యతల
జోడింపులతో విజ్ఞాన ఖనులమన్న
నామధేయం సార్థకమయ్యే విధంగా...
విజయాల నిచ్చెనలుగా మలుచుకోవాలి .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment