రాష్ట్రావతరణ స్ఫూర్తి
తేది 02-06-2022
శీర్షిక : బంగారు తెలంగాణ
కవిత సంఖ్య : 913
చతుశ్శతములు శాతవాహనులు
త్రిశతములు కాకతీయుల కాలం ....
స్వంత పరిపాలనలలో సాంత్వన
పొందిన తెలంగాణీయం ....
శౌర్యాలకు పెట్టింది పేరయినా
గౌరవాలకు భంగం కలిగింది ....
వీరులకు విలువలిచ్చి నిలిపినా
వలసలు రాజ్యమేలినాయి .....
ఆరువందలేండ్లు వలసవాదుల
పాలనలో...బానిస బతుకులీడ్చి...
అరువదేండ్ల పరపాలన శృంఖలాలను
పటుతరముగ సంకెళ్లు తెంపుకున్నాం ....
స్వార్థాలు చంకనెక్కి ఊరేగితే
శూన్యమే ఒరిగింది తొలిప్రయత్నంలో ...
విద్యార్థులు యువకులు నిర్వీర్యమై
గుణపాఠామై నిలిచింది చరితలో ..
పడినా ... లేచిన కెరటంలా
పుష్కర కాలపు పోరాటంలో
పన్నెండొందల మంది బలితో
ఫలితమాయె తెలంగాణ రాష్ట్రం ...
నీళ్లు నిధులు నియమాకాలన్నాం
కలలు నెరవేర్చుకోవాలని
కదం తొక్కించాం ... కళలను...
సకలజనులను సమ్మేళనం చేసి ....
ఎదురు తిరిగి సాధించుకొన్న
రాష్ట్రానికి ఎదురు లేదన్నట్టు ....
సంక్షేమాలకు పెద్ద పీట వేసినా
సాకారం చేయాల్సింది ఉత్పాదకతకు ....
ఎత్తిపోతలు పోసుకున్నందుకైనా
నదీమ తల్లి జలసిరులతో నగారా మోగించి
భూగర్భ నీటి వనరులు పెరిగినా….
రైతుల కష్టాలకు ముగింపు కార్డు
పూర్ణత్వం సంతరించుకోలేదు ....
చద్దిమూటలాంటి మద్దతుధరలు
ఉద్దెరపొద్దులే ఇంకా .... చేతనైన
పసుపు బోర్డులు చెట్టిక్కినయి ...
గోదాముల గడ్డు పరిస్థితే రైతన్నలకు ....
కష్టాలు తీరని కాకల కొలిమే ఇంకా
పంటల కాలానికి వడ్లన్నీ రోడ్లెక్కుడే ....
కాగడాల వెలుగులతో కళ్ళు కాయలు
చేసుకోవడమే ఇంకా నియామకాలకు ....
సాధించినది వేరుగా… రాష్ట్రమయినా
సాధించాల్సింది ఇంకెంతో ఉంది .....
యువతకు సరైన భవిత కుదిరి
అప్పులు తీర్చే ఉత్పాదకత పెరిగి
కుప్పల రాజ్యం...సుభిక్ష భోజ్యం కావాలి.....
రాజ్యాలేలే సత్తా ఎంత ఉన్నా
రాజ్యాంగాన్ని గౌరవించాలి..
ప్రజలందరినీ ప్రేమించినా
ప్రథమ పీఠానికి పట్టం కట్టాలి ....
పాలకులెంత పరితపించినా
అధికారులెంత అర్రులు చాచినా ....
ప్రజల సహకారం లేకుంటే
పథకాలకు చెల్లు చీటీలే .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment