Saturday, October 15, 2022

మబ్బుల మాటున తేది : 30-05-2022 శీర్షిక : జీవరాశి మనుగడ

 మబ్బుల మాటున

తేది : 30-05-2022
శీర్షిక : జీవరాశి మనుగడ 
కవిత సంఖ్య : 911

ఋతువుల మేళంలో గతుకుల్లా 
గ్రీష్మ జ్వాలల తాపాలకు ఆవిరైన 
సంద్రపు నీరు... అల్లన కదిలిపోవు 
తెల్లని మబ్బుల తేరుల పైకెక్కి ..... 

చిత్ర విచిత్ర ఆకారాలతో 
చిత్రకారుల కుంచెలకు 
మార్గదర్శకులై ..వింత గొలుపు 
వినీలాకాశంలో పిల్లా పెద్దలకు .... 

కొండ వాలున అల్లన తిరిగే 
చల్లగాలికి తోడుగా నిలుచి 
గాలివాటమై పరుగులు తీస్తూ 
గడబిడల గర్జనలు చేస్తూ .... 

అప్పుడప్పుడు జిగేల్ మనే 
మెరుపు తీగెల పసిడి సౌందర్యాలను 
కళ్ళకు కట్టి...మాయమౌతూ ... 
సమాయత్తమౌతాయి చినుకు బాణాలు ... 

తొలకరిగా పలకరింపులు చిలకగనే 
ఆపసోపాలు పోతూ అవని మాత 
పచ్చ తివాచీలు పరుచుకుని 
ఎనలేని ఆనందాలను పంచుతుంది ... 

పుష్కలమైన ఉప్పునీటిని సంగ్రహించినా 
పుష్కరిణి లాంటి మంచి నీటిని కురిపించి 
చెట్టూ పుట్టా గుట్టలకు హరితమయ్యి 
జీవరాశి మనుఁగడలకు నిత్య సంజీవినై నిలుచు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment