సెమటసుక్కనై పోతా
తేది : 06-06-2022
శీర్షిక : రారాజుగ ఎదగాలని .....
కవిత సంఖ్య : 915
ఆకలెవరికైనా ఒకటే ... అయినా ....
పైసలున్నోని ఆకలేమా పదిలమయితే
పైసలు లేనోని ఆకలేమో మాడ్చేస్తది
పైస చాటు మతలబులెన్నో దాగి ఉన్నవి ....
ఐదు వేళ్ళు అణకువగా నోట్లోకి
వెళ్లి ఆకలి దప్పులు తీరాలన్నా ...
మనిషికి విలువలు జోడించి
మాన ప్రాణాలను కాపాడే
వలువలు కావాలన్నా .....
కాలమాన పరిస్థితులను కాపు కాసి ...
దాపుగా నిలిచి నాగరికతల నడకల్లో...
నీడనివ్వడానికి ఇల్లు వాకిలి కావాలన్నా ......
పల్లె నిండా ఫరిడవిల్లిన చేతి
వృత్తుల కొలుములు వెలగాటానికైనా......
పట్నాల నీడలలో అభివృద్ధి
పేరు మీద వెలిసే పరిశ్రమలు
పురోగమించడానికైనా .....
కావాల్సింది సెమటసుక్కే .....
కాసులకన్నా ఎంతో గొప్పది .....
రుధిరం మదిస్తేనే సెమట
సుక్క కారేది ..... అందరివల్ల
అయ్యేది కాదది .....
అయినా ....
ఎప్పటికప్పుడు తమ డబ్బులే
గొప్పంటూ పెట్టుబడిదారుల
చేతిలో నలిగి పోతూ .... యుగాలు
గడిచినా గుర్తింపు దక్కని నాలుగవ
వర్ణంగానే మిగిలిపోతున్నది .... .
రాజకీయం రంకెలు వేస్తూ ఆపద్ధర్మంగా
కల్లబొల్లి కబుర్లెన్ని చెప్పినా .... ఆచరణలో ....
చాపకింద నీరులా ... అన్ని రకాల
సిద్ధాంతాలను నీరుగార్చుతూ .... .
పెట్టుబడి దారుల చంకలో దూరిపోతారు ....
మనుషులంతా ఒక్కటే నంటూ
మాటలు చెప్పుడే యుగాలనుండి...
అక్షరాలా ఆచరించిన గొప్పోళ్ళు
ఆనవాలుగా వదిలిందే మానవీయత ....
సెమటసుక్కది ఎప్పుడూ బానిస బతుకే
శృంఖలాలు తెంపుకునే మంచి రోజుకై
రాటు దేలి రారాజుగా వెలిగి పోయే క్షణం కోసం
మనందరం వేయి కళ్ళతో ఎదురుచూద్దాం
నగునూరి రాజన్న
No comments:
Post a Comment