నేనో నెలవంకనౌతా
తేది: 23-05-2022
శీర్షిక : అవును ... శశిని నేనే అవుతాను
కవిత సంఖ్య :907
సూదంటురాయి సూర్యుడు కేంద్రమై
చుట్టూ తింపుకునే నాయక గ్రహాలకు
పరివారమయ్యే వ్రాజక ఉపగ్రహాలతో
ప్రకాశిస్తున్న నక్షత్ర వనంలో
పరిణమించిన పలు పాలపుంతలు .....
కొలువ లేని అనంత విశ్వంలో వింతే
కొలువైన మన పాలపుంత కొంత ...
సౌరకుటుంబపు సూర్య చంద్రులు
సుక్కలు నిండిన అంబర సంబరం ..... అన్నీ
జీవమున్న ఏకైక జీవన సత్యం
భూమి అన్నదే భువన మనోహరం
విభిన్నమైన విశిష్ట వాతావరణంతో
విరాజిల్లుతున్నది రాతిగ్రహమై .....
శక్తి వనంలో శర సంధానంలా
నింగిన చెక్కిన కలువ భామలా
మెరుగులు పెట్టిన నురగ కన్యలా
తళతళలు కురిపించే వెండికొండలా ....
అవును అవకాశం చిక్కితే...
అందమైన విశ్వంలో పొందుగా
అమిరిపోయి కనువిందులు చేసే
సుమ సుందరమైన షోడశ కళల
నందనాల శశిని నేనే అవుతాను ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment