ఎన్నీల ముచ్చట్లు
తేది: 16-05-2022
శీర్షిక : అమ్మ తమ్ముడు
కవిత సంఖ్య : 902
అమ్మకు తమ్ముడైనందున
అంతా తానయ్యే ఆదుకున్నాడు
అహోరాత్రులు కంటికి రెప్పలా
అడుగడుగున మానవాళిని నాడు ...
బుద్ది నేర్వకముందు మనం
బుక్కెడు బువ్వ తినాలన్నా ....
అమ్మ సంకనెక్కి అల్లరి చేసినా
చల్లని కాంతి దీవెనలిచ్చేది .....
పల్లె రాత్రులలో మంచు పూల
వర్షమై... ఆహ్లాదాలను పంచి
ఆనందాలకు మూలమై ...లెక్కలేనన్ని
జ్ఞాపకాల సంచులెన్నో నింపింది .....
నాగరికతల నడకల్లో తోడు నిలిచి
కాల గమనాలను ఖచ్చితత్వంతో
లెక్కగట్టి ...ముందు తరాలకు
విజ్ఞానాల మూటలనందించింది ...
అమర ప్రేమికులకు ఆదరువై
విరహ తాపాలను పెంచి పోషించినా ...
కవికులానికి కలంలో సిరాయై
కావ్య కన్యకలకు మూలమై.... వెండి
తెరలలో వెలుగులీనింది .....
సాలెగూడు నెట్టింట్లో సాగిలబడినందున...
పాల మీగడల పాయసంలాంటి పండు వెన్నెల
రుచుల జాడలు... కమ్మని కబుర్లు నేటి తరం
పిల్లలకు సాంకేతికతల తెరల్లో కదలాడే
గూగులమ్మ గుసగుసల కాకమ్మ కథల ముచ్చట్లే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment