సద్దుల బతుకమ్మ
తేది: 24-10-2020
శీర్షిక: సదాచారము
సంఖ్య: 547
సద్దుల బతుకమ్మా తల్లీ
సుద్దులు చెప్పమ్మా. / స/
దుర్గవు నీవు భార్గవి నీవు
భారతి నీవు శారద నీవు
ఇందిర నీవు లక్ష్మివి నీవు
ముగ్గురమ్మల మూలపుటమ్ము / స/
హద్దులు దాటే మనుషులకు
సద్బుద్దులు నువ్వే నేర్పమ్మా.
గీతలు దాటే పాలకులకు
నీతులు నేర్పగ రావమ్మా. //స//
పచ్చన చిచ్చులు పెట్టే వారికి
ఫలితం ముందే కళ్ళకు కట్టమ్మా
ప్రకృతి మాతకు పబ్బతి పట్టే
పరిణతి మాకు ఇవ్వమ్మా // స //
అంధ యువతకు బుద్దులు నేర్ప
అపర కాళికవై చెండాడమ్మా.
ఆడపిల్లను అమ్మగ చూసే
అందమైన తత్వం నేర్పమ్మా // స //
హాళికులకు హారతులిచ్చి
సైనికులకు సెల్యూట్ కొట్టే
సద్భావనలు పెంపొందించే
సదాచారములు అందించమ్మా // స//
అవినీతులను అంతం చేసే
ధృడదీక్షలు మాకొసగి
దళారి బాధలు బాపేసి
సర్వజనావళికి సౌఖ్యములీయమ్మా //స//
అమ్మా నాన్నల వదిలే పిల్లలకు
ఆత్మీయతలను బోధించమ్మా
సర్వ మానవత వెల్లి విరిసే
సద్బుద్దులను మాకొసగమ్మా. //స //
నగునూరి రాజన్న
కరీంనగర్.
No comments:
Post a Comment